స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు పరిశీలకులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి

నామినేషన్ నుంచి పోలింగ్ వరకు ప్రతి దశను పర్యవేక్షించాలి

అభ్యర్థులకు లీగల్, మీడియా, డిజిటల్ సపోర్ట్ అందేలా సమన్వయం చేయాలి

ఎక్కడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లేకుండా పోటీ జరగకూడదు

వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు అత్యంత కీలక బాధ్యత తీసుకుని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండి పార్టీ అభ్యర్థులకు అన్ని విధాలా అండగా నిలవాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు–కోఆర్డినేషన్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు–కోఆర్డినేషన్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన దిశానిర్దేశం చేశారు.  ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియకు చాలా తక్కువ సమయం ఇస్తున్నారని సజ్జల అన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక పని తర్వాత మరో పని చేసే అవకాశం లేకుండా, అభ్యర్థుల ఎంపిక, పత్రాల సిద్ధత, నామినేషన్లు, ప్రచారం అన్నీ సమాంతరంగా జరగాల్సి వస్తోందని చెప్పారు.

ఎక్కడా పోటీ లేకుండా ఉండకూడదు

పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ గారు స్పష్టంగా చెప్పినట్లుగా, ఎక్కడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లేకుండా పోటీ జరగకూడదని, ఏ స్థానం కూడా అన్‌కంటెస్టెడ్‌గా ఉండకూడదని సజ్జల స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికకు సమయం తక్కువగా ఉన్నందున, కోఆర్డినేటర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నదా లేదా అన్నది పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అసెంబ్లీ పరిశీలకులే కీలక లింక్

అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎన్నికల పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారని, అందువల్ల అసెంబ్లీ పరిశీలకులు కోఆర్డినేటర్–పార్లమెంట్ పరిశీలకుడు–రీజినల్ కోఆర్డినేటర్–జిల్లా అధ్యక్షుడు–కేంద్ర కార్యాలయం మధ్య కీలక అనుసంధానకర్తలుగా పనిచేయాలని చెప్పారు. ఎక్కడైనా సమన్వయ లోపం, అభ్యర్థుల ఎంపికలో సమస్య, ప్రచార లోపం, నామినేషన్ ఇబ్బందులు కనిపిస్తే వెంటనే సరిదిద్దాలని, అవసరమైతే పైస్థాయికి నివేదించాలని సూచించారు.

15–20 రోజులు 24/7 ఫీల్డ్‌లో ఉండాలి

రానున్న 15 నుంచి 20 రోజులు పరిశీలకులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో 24/7 అందుబాటులో ఉండటం తప్పనిసరి అని సజ్జల స్పష్టం చేశారు. “ఇది మీటింగ్‌లలో కూర్చొని ప్రోటోకాల్ ప్రకారం చేసే పని కాదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రత్యక్షంగా ఉండాలి. సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. అభ్యర్థికి ‘మేమున్నాం’ అనే భరోసా కలిగించాలి” అని చెప్పారు. చిన్నపాటి అంతర్గత విభేదాల నుంచి, సీనియర్ నాయకులతో సమన్వయం, స్థానికంగా నాయకులను కలుపుకోవడం వరకు పరిశీలకులు చొరవ తీసుకోవాలని సూచించారు.

అభ్యర్థులకు పూర్తి సపోర్టింగ్ సిస్టమ్

కొత్తగా పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు, నామినేషన్ విధానం, లీగల్ అంశాలు, మీడియా ప్రచారం, డిజిటల్ ప్రచారం గురించి పూర్తి అవగాహన ఉండకపోవచ్చని సజ్జల చెప్పారు. అందువల్ల వారు ప్రధానంగా ప్రజల్లో తిరిగి ప్రచారం చేయడంపై దృష్టి పెట్టేలా, మిగతా లీగల్, మీడియా, డిజిటల్, ఆర్గనైజేషనల్ పనులను పార్టీ వ్యవస్థ చూసుకుంటుందనే భరోసా ఇవ్వాలని సూచించారు.

సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధం చేయాలి

కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ తదితర సర్టిఫికెట్ల విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందని సజ్జల హెచ్చరించారు. ఫైనల్ అయిన అభ్యర్థులు వెంటనే అవసరమైన పత్రాలకు దరఖాస్తు చేయాలని, 24 గంటల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలని పార్టీ తరఫున ఇప్పటికే లేఖలు ఇచ్చామని తెలిపారు. ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత వివరాలను వెంటనే కేంద్ర కార్యాలయానికి పంపించాలని, అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని సూచించారు.

నామినేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోనివ్వకూడదు

నామినేషన్ ప్రక్రియలో ప్రత్యర్థులు లేదా అధికార యంత్రాంగం ఏవైనా అడ్డంకులు సృష్టిస్తే వాటిని వెంటనే గుర్తించి స్పందించాలని చెప్పారు. నామినేషన్ కేంద్రాల్లో ఉద్దేశపూర్వకంగా క్యూ సృష్టించడం, చివరి సమయంలో పత్రాలు తీసుకోకుండా చేయడం వంటి కొత్త ఎత్తుగడలు కూడా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే నామినేషన్లు పూర్తి చేయాలని సూచించారు. 

ప్రతి ఘటనకు వీడియో ఆధారం ఉండాలి

ఎక్కడైనా నామినేషన్ అడ్డుకోవడం, పోలీసు జోక్యం, ప్రత్యర్థుల దౌర్జన్యం లేదా అధికారుల పక్షపాతం కనిపిస్తే వాటిని వీడియో రూపంలో రికార్డు చేయాలని సూచించారు. ఈ వీడియోలను మీడియా ప్రచారానికి మాత్రమే కాకుండా, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు, న్యాయస్థానాల్లో ఆధారాలుగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు.

ప్రచారం పర్యవేక్షణ కూడా పరిశీలకుల బాధ్యత

నామినేషన్ల తర్వాత అభ్యర్థుల ప్రచారం ఎంత సమర్థంగా జరుగుతోంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారా, మీడియా కవరేజ్ వస్తుందా, సోషల్ మీడియా ద్వారా అభ్యర్థి పేరు, గుర్తు ప్రజల్లోకి వెళ్తున్నాయా అన్నది కూడా పరిశీలకులు పర్యవేక్షించాలని చెప్పారు. ఏ అభ్యర్థి ప్రచారంలో వెనుకబడినా వెంటనే అలర్ట్ చేసి, అవసరమైతే కోఆర్డినేటర్, పార్లమెంట్ పరిశీలకుడు లేదా కేంద్ర కార్యాలయం ద్వారా ఫాలోఅప్ చేయాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాలు, సీసీ కెమెరాలు, కౌంటింగ్ ఏర్పాట్లపై నిఘా

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారో, సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా, కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ముందుగానే పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద ఏర్పాట్లు ఉంటే ఎన్నికల అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని, ఫలితం లేకుంటే అవసరమైతే న్యాయపరంగా సవాలు చేయాలని చెప్పారు.

రోజువారీ రిపోర్టింగ్ వ్యవస్థ

కేంద్ర కార్యాలయం నుంచి రోజువారీ రిపోర్టింగ్ మెకానిజం ఏర్పాటు చేస్తున్నామని సజ్జల తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని పార్లమెంట్ పరిశీలకులు, రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, కేంద్ర కార్యాలయంతో పంచుకోవాలని, అక్కడి నుంచి వచ్చే సూచనలు, గైడ్‌లైన్స్‌ను వెంటనే కిందిస్థాయికి చేరవేయాలని చెప్పారు.

లీగల్–మీడియా టీమ్‌లతో నేరుగా కనెక్ట్ కావాలి

అత్యవసర పరిస్థితుల్లో పరిశీలకులు నేరుగా పార్టీ లీగల్, మీడియా టీమ్‌లను సంప్రదించవచ్చని సజ్జల చెప్పారు. లీగల్ సెల్, మీడియా విభాగం, కేంద్ర కార్యాలయంలో సంబంధిత నాయకులు అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా తక్షణ స్పందన అవసరమైతే ఆలస్యం చేయకుండా సమాచారం అందించాలని సూచించారు.

ప్రజల్లోకి వేగంగా చేరే ప్రచారం అవసరం

ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున డిజిటల్, సోషల్ మీడియా ద్వారా స్థానిక సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గత ప్రభుత్వంలో జరిగిన పనులు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరవేయాలని సూచించారు.

పరిశీలకుల పనితీరుకు కూడా ఇదే పరీక్ష

ఈ ఎన్నికలను కోఆర్డినేటర్లకు మాత్రమే కాకుండా పరిశీలకులకు కూడా ఒక పరీక్షగా భావించాలని సజ్జల అన్నారు. ఎవరెంత సమర్థంగా క్షేత్రస్థాయిలో పనిచేశారు, సమస్యలను పరిష్కరించారు, అభ్యర్థులకు అండగా నిలిచారు, కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేశారు అన్నది పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందని చెప్పారు. “ఈ 15–20 రోజులు మీకు కేటాయించిన నియోజకవర్గంలో పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. సమస్య ఎక్కడ ఉంది? దానికి పరిష్కారం ఏమిటి? వెంటనే ఎలా అమలు చేయాలి? అనే దృక్పథంతో పనిచేయాలి. ఇది అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సందేశం, ఆదేశంగా భావించాలి” అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Back to Top