తాడేపల్లి: రాష్ట్రంలో ఓవైపు ఎల్లుండి కొత్త ఓటర్ల జాబితా రాబోతోందని, మరోవైపు త్వరలో దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయని, అయినా లెక్కచేయకుండా పాత ఓటర్ల జాబితాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆరాటం వెనుక కూటమి సర్కార్ కుట్ర దాగుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత హడావిడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. గతంలో అర్ధరాత్రి ఆత్మలతో ఓట్లేయించుకుని గెలిచిన కూటమి సర్కార్... ఇప్పుడు మరోసారి అదే ట్రిక్ తో స్ధానిక ఎన్నికల్నీ గెలిచేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శైలజానాథ్ తెలిపారు. ప్రెస్ మీట్లో సాకే శైలజానాథ్ ఇంకేమన్నారంటే..: హడావిడిగా స్థానిక ఎన్నికలు ఎందుకో?: ఇవాళ ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ రాష్ట్రంలో ఓ డ్రామా జరిగింది. నిన్న స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమాచారం అంతా ఉందని చెప్పిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. ఇవాళ ఉదయం జరగాల్సిన ప్రెస్ మీట్ ను జిల్లాల నుంచి సమాచారం లేదని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి సైతం ఎన్నికల విషయంలో చాలా తొందరపడుతున్నారు. కూటమి ప్రభుత్వ అధికార వ్యామోహాన్ని అడ్డుకోలేకపోతే, అసమర్థత రాజకీయ వికత క్రీడను అంతు చేయకపోతే ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది. కూటమిలో ఉన్న పార్టీలకు సీట్ల పంపకాల్లో తేడాలు రావడం వల్లే ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ను మధ్యాహ్నానికి వాయిదా వేయించినట్లు అర్దమవుతోంది. మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళం, రాజమండ్రి ఎన్నికల వాయిదా వెనుక ఎవరి జోక్యం ఉందో అందరికీ అర్దమవుతోంది. కూటమిలో లెక్కలు కుదరలేదు కాబట్టే ఈ సీట్లలో ఎన్నికల్ని నిర్వహించకుండా వాయిదా వేసేశారు. ఇందులో వచ్చిన ఒక్క ఎస్టీ సీటు మంగళగిరిలో కూడా ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఇంత దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఎందుకో ముఖ్యమంత్రి చెప్పాలి. ఎల్లుండి కొత్త ఓటర్ల జాబితా వస్తుందని తెలిసీ..: ఈ నెల 16వ తేదీన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (సర్) తర్వాత తుది జాబితా రాబోతోంది. ఇందులో 44 లక్షల మంది చనిపోయినవారో, డూప్లికేట్ ఓట్లు ఉన్నవారో, దీర్ఘకాలికంగా రాష్ట్రం వెలుపల ఉన్న వారో ఉన్నట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. వీటితో పాటు మరో 11 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేయాల్సి ఉంది. ఇక్కడే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. చనిపోయిన వారి పేర్ల మీద ఓటింగ్ జరిపించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందా ? ఆత్మలతో అర్ధరాత్రి ఓట్లు వేయించారన్న అపవాదును ఇప్పటికే కూటమి ఎదుర్కొంటోంది. కడిగిన ముత్యాలని చెప్పుకునే మీరు చనిపోయిన వారితో ఉన్న ఓటర్ల లిస్టును మీరు అంగీకరిస్తున్నారా చెప్పాలి. రేపు ఆ పేరుతో ఉన్న వారి ఆత్మలు వచ్చి నామినేషన్ వేస్తే మీరు ఒప్పుకుంటారా?. మున్సిపాలిటీలకూ, జడ్పీటీసీలు, ఎంపీటీసీ ఎన్నికలకు మధ్య తగినంత సమయం ఉంది. మున్సిపాలిటీల్లో ఓట్లేసి, ఆ తర్వాత వారే ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఓటేస్తే మీరు ఒప్పుకుంటారా? అలాగే రాష్ట్రం బయట ఉన్న డూప్లికేట్ ఓటర్లను తెచ్చి ఓట్లు వేయించాలనుకుంటున్నారా? ఏ పాత ఓటరు లిస్ట్ తో మీరు గెలిచారో, దాంతోనే మీరు మళ్లీ ఎన్నికలు జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందా? ఎన్నికల సంఘం కూడా ఇదే కోరుకుంటోందా చెప్పాలి. దీనికి మీ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇదేనా మీ హిందూ ధర్మ పరిరక్షణ?: హిందూ ధర్మం గురించి స్పీచ్ లు ఇస్తుంటారు. 20న దసరా, దీపావళి వచ్చే నెల 8న వస్తోంది. మేం పండుగ జరుపుకోవడం మీకు ఇష్టం లేదా ? పండుగల రోజుల్లోనే మేం వెళ్లి నామినేషన్లు వేయాలా ? ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా ? దేని కోసం ఇలా పరుగులు పెడుతున్నారో మీకైనా స్పష్టత ఉందా? మేం ప్రశ్నిస్తే 14 వేల కోట్లు రాకుండా అడ్డుకుంటున్నామని సాకులు చెప్తుంటారు. ఎన్డీయే ప్రభుత్వంలో మేమే కీలకం, డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటూ, పుట్టినరోజులకు కాశీకి వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు కదా, కేంద్రానికి చెప్పి ఆ మాత్రం నిధుల విడుదలలో మార్పులు చేయించుకోలేరా? అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయించుకోవచ్చు కదా. బీసీలకు కూడా ద్రోహం చేశారు. కేసులు కొట్టేస్తారు, కోర్టుల్లో నిలబడవని తెలిసీ రిజర్వేషన్లు ఇచ్చినట్లు నటించి, పేపర్లో ప్రచారాలు చేయించుకుని, పూలు జల్లుకున్నారు. సుప్రీంకోర్టు గంటలో ఈ కేసు కొట్టేసింది. మీకు ఆ విషయం ముందే తెలుసు. లాయర్లకు ఇచ్చిన డబ్బులు కూడా వృథా. ఈ విషయం రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. చట్టబద్దంగా ఆర్ధిక సంఘం నుంచి రావాల్సిన డబ్బులు ఎలాగో నెల ఆలస్యమైనా వస్తాయి. ప్రతీ మంగళవారం ఎలాగో అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అప్పులు నాలుగు లక్షల కోట్లు దాటిపోయాయి. సజావుగా ఎన్నికలు జరిగితే గెలవలేరనే భయంతో హడావిడిగా పెద్ద పండుగలు దసరా, దీపావళిని కూడా లెక్కచేయకుండా ఎన్నికలకు వెళ్తున్నారు. మాట్లాడితే కులాలు, మతాలు అంటూ రాజకీయాలు చేస్తారు. ఈ సంవత్సరం మీరు ఎన్నికల పేరు మీద దసరా, దీపావళి నిషేధించారా అని అడుగుతున్నాం. ఎస్ఈసీ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి: రాయలసీమలో విపరీతంగా కరువు, ఎండలు ఉన్నాయి. జనం బాధలు, కష్టాల్లో ఉన్నారు. ఇవన్నీ మీకు కనబడటం లేదా?, డిసెంబర్ లోపు మొత్తం ఎన్నికలు అయిపోవాలంటున్నారు, జనవరిలో జరిపితే ఏం నష్టం మీకు?, వైఎస్సార్సీపీ నేతలపై రౌడీ షీట్లు, బైండోవర్లు, పాత కేసులు తిరగతోడటం, వీటికి తోడు రెవెన్యూ, పోలీసులు మా నేతల మీద పెడుతున్న ప్రత్యేక శ్రద్ద, ఒత్తిడి అందరికీ కనిపిస్తున్నాయి. చనిపోయిన వాళ్ల పేర్లు ఓటర్ల లిస్టులో ప్రింట్ చేసుకుని, దాంతో ఎన్నికలు నిర్వహిస్తున్నామంటే, డబుల్ ఎంట్రీ ఓటర్లు ఓటేస్తున్నారంటే, వలసల పేర్లతో ఓట్లేయిస్తున్నారంటే మన ఎన్నికల వ్యవస్థను చూసి జనం నవ్వుతారు. ఏ ప్రజాస్వామ్య వెలుగులకి మీ ప్రయాణమో చెప్పాలి. మంగళగిరికి మాత్రమే ఒక్క ఎస్టీ మేయర్ సీటు కేటాయించారు. రెండు రావాల్సిన చోట మంగళగిరి ఒక్కచోట మాత్రమే ఎస్టీలకు ఇచ్చారు. ఎస్టీల మీద మీ ప్రేమ అలా ఉంది మరి. స్థానిక సంస్దల ఎన్నికలు ఎంత గట్టిగా జరుగుతాయో, ఊర్లలో ప్రశాంతత కూడా లేకుండా చేయాలనే వాటిని హడావిడిగా పెడుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ఈ ఆత్రానికి కారణం ఏంటో ఆయన చెప్పాలి. కేవలం ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడానికే ఎన్నికలు ఇంత హడావిడిగా నిర్వహిస్తున్నట్లు అనిపిస్తోంది. చంద్రబాబును, ఆయన రాజకీయ ఆలోచనల్ని ప్రజలు గమనిస్తున్నారు. మా పార్టీ వాళ్లకు కుల సర్టిఫికెట్లు, ఎన్వోసీలు ఇవ్వకుండా సర్వర్ల డౌన్ పేరు చెప్పి అడ్డుకుంటున్నారు. ఎన్నికల సంఘం కూడా దయచేసి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఎల్లుండి నుంచి కొత్త ఓటర్ల లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నా ఇంత హడావిడిగా ఎన్నికలు నిర్వహించడాన్ని అందరూ ఓసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని సాకే శైలజానాథ్ కోరారు.