నెల్లూరు: చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో ఇవాళ చేసినది పట్టాభిషేకం కాదు.. రక్తాభిషేకం అని వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి ఎద్దేవా చేసారు. డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత తీవ్రంగా నష్టపోతున్నారని కాకాణి ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత రక్తాన్ని పీల్చుకు తాగుతోందని తీవ్ర ఆగ్రహించారు. నెల్లూరు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఎవరు ఏం చేశారో తెలుసని, కేవలం ప్రచార కార్యక్రమాలతో వాస్తవాలను మార్చలేరని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. చంద్రబాబు ఏమీ చేయకపోయినా సరే అన్నీ తానే చేసినట్లు ప్రచారం చేసుకునేందుకే ఆర్భాటంగా ఈవెంట్లు నిర్వహిస్తూ బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా కేంద్ర నిధులతో చేసే పనులకు సైతం చంద్రబాబు తానే చేస్తున్నట్లుగా సెల్ఫ్ క్యాంపెయిన్ చేసుకుతిరగడం సిగ్గు చేటని మండిపడ్డారు. పల్లె పండగ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. నెల్లూరులో నిర్వహించిన పట్టాభిషేకం అభివృద్ధి కార్యక్రమం కాదని, కేవలం ప్రచార ఆర్భాటమేనని కాకాణి విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద సాధారణంగా చేపట్టే పనులకు భారీగా ప్రచారం కల్పిస్తూ, కొత్తగా ఏదో సాధించినట్లుగా చెప్పుకోవడం చంద్రబాబు దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవా చేసారు. ఈ ప్రెస్ మీట్లో ఇంకా ఆయన ఏం మాట్లారంటే... ఈవెంట్ల పేరుతో బాబు బిల్డప్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా సరే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సహజంగానే సాగుతుటాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పంచాయతీ భవనాలు, రచ్చబండలు, ఉద్యానవన పంటల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు కొత్తవి కావు. కేంద్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టే ఉపాధి హామీ పనులకు భారీ ఈవెంట్ల పేరుతో రాజకీయ రంగు పులుముడం సరికాదు. ప్రజా సంక్షేమం కంటే ఈవెంట్లు, ప్రచార కార్యక్రమాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తి ఉండటం ప్రజల దురదృష్టం. గత ప్రభుత్వాల పనులకు క్రెడిట్ తీసుకోవం చంద్రబాబుకు అలవాటుగా మారింది. వెలుగొండ ప్రాజెక్టులో వైఎస్సార్ హయాంలోనే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులకు కూడా తానే కారణమన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం గోబెల్స్ కు సైతం మైండ్ పోతోంది. గతంలో సీ ప్లేన్ ప్రాజెక్టు పేరుతో చేసిన ప్రచారం ఏమైందో ప్రజలకు చంద్రబాబు వివరించాలి. గోదావరి జలాలను అనకాపల్లికి తరలించే విషయంలోనూ ఇప్పటికే ఉన్న వ్యవస్థల పరిధిలోనే అమలు చేస్తున్నారు. దానికే చంద్రబాబు పెద్ద పెద్దగా బిల్డప్ ఇస్తూ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి కోసమే.. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. ‘పల్లె పండగ అంటే జగన్ హయాంలోనే.. చంద్రబాబు హయాంలో పల్లెలకు చేసినది ఏముంది?’ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ‘పల్లె పండగ-3’ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రజలను మభ్య పెట్టేందుకే వరుసగా వివిధ కార్యక్రమాల పేరుతో ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. నిరుద్యోగ భృతి, గ్యాస్ సిలిండర్లు తదితర హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఆ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి, ఏ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రభుత్వం వివరాలు వెల్లడించాలి.