తాడేపల్లి: రాష్ట్రంలో ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం అలవాటుగా మారిపోయిందని, డీఎస్సీ అక్రమాల్ని ప్రశ్నించేందుకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నేతలపై, బాధిత అభ్యర్ధులపై దాడులు ఇందులో భాగమేనని పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. ఇలాంటి దాడులకు వైయస్ఆర్‌సీపీ భయపడదని ఆయన తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఇలాంటి దాడుల తర్వాతే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని, ఇక్కడ కూడా డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని జూపూడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లో జూపూడి ప్రభాకర్ రావు ఇంకేమన్నారంటే... సమాధానం చెప్పలేకే ప్రభుత్వం భౌతిక దాడులు రాజ్యం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. ప్రభుత్వమే గూండాగా మారిపోతే, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మా ఇష్టం వచ్చినట్లు మేం పాలిస్తాం, ఉంటే ఉండండి, వింటే వినండి అన్న ధోరణిలో ఉంటే సమాజం ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తుతోంది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం, పాలక వర్గం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ప్రతిపక్షానికి సీట్లు తగ్గాయనో, అసెంబ్లీకి రావట్లేదనో, టైం, ప్లేస్ చెప్తాం రమ్మనే అహంకారపు మాటలు పాలకపక్షం మానేస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ప్రభుత్వంలో జరిగే ప్రతీ అంశాన్నీ ఎత్తి చూపే నైతిక బాధ్యత ఆయనకు రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని ఆయన నిర్వర్తిస్తున్నారు. ప్రతిపక్ష నేత ప్రజాభిప్రాయాన్ని లేవనెత్తుతుంటే సమాధానం చెప్పడం పాలక పక్షం బాధ్యత. కానీ పాలక పక్షం తిరిగి దాడులకు పూనుకుంటే, ప్రభుత్వం ఓ రౌడీగా ఉంటే రాజ్యాంగం ఏం చెప్తోంది, ప్రజలు ఏం ఆలోచిస్తారన్నది చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. డీఎస్సీలో జరిగిన అవకతవకల్ని గత మూడు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఎత్తిచూపుతూ నాలుగు ప్రెస్ మీట్లు పెట్టారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయి, సర్ఠిఫికెట్ల ధృవీకరణ జరిగి, రేపో మాపో ఉద్యోగం వస్తుందని ఆశల్లో ఉన్న వారికి, మీ ఉద్యోగాలు పరీక్షలు రాయని వేరే వాళ్లకు ఇచ్చారని తెలిసింది. మీ ఉద్యోగాలన్నీ వేరే వాళ్లకు ఇచ్చారు, పరీక్షలు రాయకపోయినా యువగళం అని, ప్రభుత్వానికి దగ్గర మనుషులని, లోకేష్ మనుషులని తేల్చారు. ఎప్పుడో యువగళంలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు వీళ్లకు ఉద్యోగాలు ఇచ్చేసి, అర్హులైన వారికి అన్యాయం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తూ వారంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో లోకేష్ కూడా రాజీనామా చేయాలి డీఎస్సీ పరీక్షకు ప్రశ్నలు తయారు చేసిన వ్యక్తి, ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న వ్యక్తి స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అతను ఇప్పుడు ఏమై పోయాడు ?, సాయికృష్ణ లాగే అతన్ని కూడా లాకప్ డెత్ లో చంపేశారా ? అతను నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఇవ్వట్లేదని కోర్టులో అఫిడవిట్ వేశాడు, అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వట్లేదో ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం సరైన పద్ధతిలో రిక్రూట్ మెంట్ జరిపి ఉంటే, ఇప్పుడు రోషాలు ఎందుకు వస్తున్నాయి. ప్రజల తరఫున నిలబడి వైయస్ఆర్‌సీపీ దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని అడుగుతోంది. సిట్ లు, స్టాండ్ లు వేస్తారు కానీ సీబీఐ దర్యాప్తు మాత్రం వేయరు. స్వయానా ముఖ్యమంత్రి కొడుకే దీనికి బాధ్యుడు కాబట్టి, అతన్ని రాజీనామా చేయాలని కోరుతున్నాం. జంతర్ మంతర్ లో నీట్ అక్రమాలపై ఓ దళిత యువకుడు అభిజిత్ దిప్కే విదేశాల నుంచి వచ్చి నీట్ అక్రమాలపై ప్రశ్నిస్తే ఏపీ ప్రభుత్వం లాగే కేంద్ర ప్రభుత్వం కూడా అడ్డం తిరిగింది. వాళ్లు జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే లాఠీచార్జ్ చేశారు. ఇందులో పోలీసులతో పాటు ప్రైవేటు గ్యాంగులు కూడా వచ్చాయని సీసీటీవీ ఫుటేజ్ లో తేలింది. నిన్న శాప్ కార్యాలయం దగ్గర దివ్యాంగులు ధర్నాకు వస్తే వాళ్ల కర్రలు లాక్కుని దాడులు చేస్తారా ?, ఢిల్లీలో ఇలాంటి దాడుల తర్వాతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నది వీళ్లు గుర్తుంచుకోవాలి. లోకేష్ ను ఏమైనా అంటే చస్తాం లేదా చంపుతాం అంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరి మీద కేసులు పెట్టాలి. ధర్నాకు వెళ్లిన వారంతా వైయస్ఆర్‌సీపీ నేతలు లేదా డీఎస్సీ రాసిన వాళ్లు. అలాంటి వాళ్ల మీద గూండాల్ని వదులుతుంటే పోలీసులు నిద్ర పోతున్నారా ? వీళ్లని వదిలేసి ధర్నాకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నేతలందరిపైనా కేసులు పెట్టేశారు. కాబట్టి డీఎస్సీ మీదే కాదు మీ దాడులపైన కూడా సీబీఐ దర్యాప్తు అడుగుతాం. డీఎస్సీ స్కాంపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడరు? టీచర్లపై దాడులు చేస్తే మేం ఊరుకోం అంటున్న వారే టీచర్లను వైయస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే కర్నూలు, విజయవాడ, శ్రీకాకుళంలో పోటీ ధర్నాలు చేయించారు. ఉద్యోగుల్ని రెచ్చగొట్టి పోటీ ధర్నాలు చేయించిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేదు. డీఎస్సీలో ఎంపికైన టీచర్లను రెచ్చగొట్టి మాపై పంపుతున్నారు, రేపు మేం అధికారంలోకి వచ్చాక ఈ ఘటనలపై సమీక్షించే వాళ్లంతా ఇబ్బంది పడరా ?, కాబట్టి వెన్నుపోటు పార్టీ నేతలు చెప్పారనో, ప్రభుత్వం చెప్పిందనో ధర్నాలకు వస్తే ఇబ్బందులు తప్పవన్న విషయం వారంతా దయచేసి గుర్తించాలి. ఎదురుదాడులు చేయించే వారు విద్యాశాఖ మంత్రిగా పనికి రారు. కాబట్టి లోకేష్ రాజీనామా చేసి తీరాలి. గతంలో విద్యాశాఖ మంత్రులుగా చేసిన వారంతా సున్నితంగా ఉండే వారు, విద్యావంతులు కూడా. అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్న చంద్రబాబు, లోకేష్ స్వయంగా ఎందుకు అంతా సక్రమంగా జరిగిందని ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు చెప్పలేకపోతున్నారు. బహిరంగ సభల్లో చెప్పుకోవడం ఎందుకు ? రేపు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలు పెట్టి ప్రశ్నిస్తే మీరు నిలబడగలరా ? ప్రభుత్వం ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని సూచిస్తున్నాం. ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. సమాధానం చెప్పాల్సిన స్ధానంలో ఉన్న విషయం మర్చిపోయి ప్రభుత్వం సరిదిద్దుకోలేని తప్పులు చేస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ ఉదాహరణ అందరికీ కనిపిస్తోంది. 30 ఏళ్ల లోపు పిల్లలకే తల వంచిన ప్రభుత్వాల్ని చూస్తున్నాం. మీరూ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. మీ గూండాయిజం, రౌడీ యిజం, అహంకారం, ప్రతీకారం చూస్తున్నాం. మేం మాత్రమే ఉండాలి, ప్రతిపక్షం అక్కర్లేదన్న మీ తలబిరుసుతనం చూస్తున్నాం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ వ్యవస్థ ఇది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు రావు, మా ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా గెలుస్తాం అనుకుంటున్నారా ? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతోందో ఊహించే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు, నాయకులు, ఇన్ ఛార్జులకు కచ్చితంగా పోటీ ఉంటుంది, సిద్దంగా ఉండాలని చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తోంది విపక్ష నేతగా పోరాటం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని బతికించే బాధ్యత కూడా. ఆయన దగ్గర జవాబుదారీతనం ఉంది. డీఎస్సీలో ఇన్ని అక్రమాలు జరిగాక, ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకోకపోతే మాట్లాడే అర్హత కోల్పోయినట్లే. డీఎస్సీ అవకతవకలపై వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆగదు వైయస్ జగన్ గారు అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందని వెన్నుపోటు పార్టీ దుష్ప్రచారాలకు దిగుతోంది. వైయస్ జగన్ గారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇంగ్లీష్ రాని వాళ్లకు ఇంగ్లీష్ నేర్పిస్తాడు, పేద పిల్లలు చదువుకోవడానికి బడులు లేకపోతే బడులు కట్టిస్తారు, ప్రజలకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రులు కట్టిస్తాడు, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బాగు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వం గుడ్డిది, మూగది, చెవిటిది అయిపోయింది. ఏం చేయాలో అది చేయకుండా, చేయకూడనిది చేస్తోంది. చేయకూడని పనులు చేస్తే కచ్చితంగా దెబ్బలు తగులుతాయి. వైయస్ జగన్ గారు డీఎస్సీ అక్రమాల అంతు చూడటం ఖాయం. పిల్లలు, ప్రజలు తమ ఆలోచనా విధానం మార్చుకుంటున్నారు. ఆ విషయం ప్రభుత్వానికి అర్ధం కావాల్సిన సమయం వచ్చింది. తప్పు జరిగిందని మేం చెబుతున్నాం, జరగలేదని అనుకుంటే సీబీఐ దర్యాప్తు చేయించండి. డీఎస్సీ అక్రమాలపై కోర్టులు మొట్టికాయలు వేసే వరకూ ఆగకుండా మీరే దిగిపోండి. డీఎస్సీ తప్పిదాలపై ప్రశ్నిస్తానని వచ్చిన వ్యక్తి ఎందుకు ప్రశ్నించరు ?, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు ? పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుపడింది కాబట్టి, ఇకనైనా డీఎస్సీ సమస్యపై అధ్యయనం చేయండి. గతంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారని చెప్పి, అధికారంలోకి వచ్చాక వదిలేసినట్లు డీఎస్సీ సమస్యను కూడా వదిలేయకండి. శరీరంలో లివర్, లంగ్స్ ఎలా ముఖ్యమో.. ఓ రాజకీయ నాయకుడికి మానవత్వం కూడా అంతే ముఖ్యం. అది మీకు లేకపోతే వైయస్ జగన్ గారు తప్పకుండా సరిచేస్తారు. డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు చేయించనంత కాలం, లోకేష్ రాజీనామా చేయనంత కాలం వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని జూపూడి ప్రభాకర్ రావు తేల్చిచెప్పారు.