వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతిస్తే ఉపాధి హామీ పనులు నిరాకరిస్తారా?

ఓటు హక్కును కూలీ పనితో ముడిపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం: సరిబాల ప్రతాప్‌రెడ్డి

అనంత‌పురం:  ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చారనే కారణంతో పేదలకు ఉపాధి హామీ పనులు నిరాకరించడం ఏమిటని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సరిబాల ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్కూల్‌ కమిటీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతు ఇచ్చారనే కారణంతో ఉపాధి హామీ పనులకు వెళ్లిన గ్రామస్తుల పట్ల టీడీపీ నాయకులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

గ్రామస్తులు ఉపాధి హామీ పనుల కోసం సమర్పించిన డిమాండ్‌ పత్రాలను చించివేసి, వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతు ఇస్తున్నందున పని కల్పించాల్సిన అవసరం లేదంటూ మాట్లాడినట్లు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును వినియోగించుకున్నందుకు కూలీ పనిని ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించారు.  ఓటు ఒక రాజకీయ హక్కు.. కూలీ పని ఒక జీవన హక్కు అని స్పష్టం చేశారు.

బండ్లపల్లిలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఘటనపై గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ పత్రాలను చించివేసినట్లు వచ్చిన ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన గ్రామస్తులకు ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా వెంటనే ఉపాధి హామీ పనులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top