స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు వైయ‌స్ఆర్‌సీపీని వీడారు

 బొత్స సత్యనారాయణ 

 విజయనగరం: కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వైయ‌స్ఆర్‌సీపీని వీడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీలో ఉన్నప్పుడు కొందరిని తీవ్రంగా విమర్శించిన టీడీపీ నేతలే ఇప్పుడు వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో విమర్శించిన వారినే ఇప్పుడు పార్టీలోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అన్ని గ్రామాల్లో పోటీ చేయాలని బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు సూచించారు. పుకార్లను నమ్మకుండా ఎన్నికలకు సిద్ధం కావాలని, అన్ని స్థానాల్లో విజయం లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఏకాభిప్రాయంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైనికులేనని అన్నారు.

రెండేళ్లలో వైయ‌స్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించడంతో సుజల స్రవంతికి నీరు వచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని తెలిపారు. రానున్న ప్రభుత్వంలో పార్టీ కోసం పనిచేస్తున్న వారిదే కీలక పాత్ర ఉంటుందని పేర్కొన్నారు.

Back to Top