రాయలసీమకు చంద్రబాబు తీరని శాపం

మాజీ మంత్రి ఆర్‌కె రోజా ధ్వజం

సొంత సర్వేల్లో పాతాళానికి పడిపోయిన టీడీపీ, జనసేన గ్రాఫ్‌

అందుకే రైజింగ్‌ రాయలసీమ పేరుతో బాబు, పవన్‌ దొంగ నాటకాలు

ఆర్‌కె రోజా ఫైర్‌

నగరిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా.

రాయలసీమకు వైయ‌స్ఆర్‌  కుటుంబమే వరం

వైయ‌స్ఆర్‌, జగన్‌ చేసిన అభివృద్ధికి బాబు క్రెడిట్‌ చోరీ

మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆక్షేపణ

తిరుమల లడ్డూ, వివేకా హత్య కేసులు తేల్చేసిన సీబీఐ

అయినా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిందలు, బుకాయింపులు

బాబు, పవన్‌ తక్షణమే రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలి

ప్రెస్‌మీట్‌లో ఆర్‌కె రోజా డిమాండ్‌

నగరి: రాయలసీమ అభివృద్ధి, హార్టికల్చర్‌ హబ్, ఫ్రూట్‌ బౌల్‌ అంటూ పచ్చి అబద్దాలతో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మభ్య పెడుతోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. నాలుగుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రాయలసీమకు చేసిన మేలు శూన్యమని, దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ఆర్‌, మాజీ సీఎం జగన్‌గారి హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రాజెక్టులను తామే చేసినట్లు చూపుతూ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నిస్సిగ్గుగా క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు.
    మరోవైపు సీబీఐ దర్యాప్తులో తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని తేలినప్పటికీ, అలాగే వివేకానందరెడ్డి హత్య కేసుతో జగన్‌గారికి ఏ సంబంధం లేదని కోర్టులు, సీబీఐ తేల్చినప్పటికీ.. ఇంకా వైయ‌స్ఆర్‌సీపీపైనా, జగన్‌గారిపైనా నిందలు వేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆర్‌కె రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు, తప్పుడు ఆరోపణలు చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తక్షణమే పదవులకు రాజీనామా చేసి, శ్రీవేంకటేశ్వరస్వామి వారికి.. అలాగే జగన్‌గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నగరిలో మీడియాతో మాట్లాడిన ఆర్‌కె రోజా డిమాండ్‌ చేశారు. 
ప్రెస్‌మీట్‌లో ఆర్‌కె రోజా ఇంకా ఏం మాట్లాడారంటే..:

రాయలసీమకు చంద్రబాబు పెద్ద శాపం:
    రాయలసీమకు వైయ‌స్ఆర్‌ గారి కుటుంబం ఒక వరమైతే, చంద్రబాబునాయుడు ఒక పెద్ద శాపం. వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ హయాంలో సుభిక్షంగా విలసిల్లిన రాయలసీమ.. నేడు బాబు పాలనలో తీవ్ర దుర్భిక్షంగా మారింది. రాయలసీమపై అమితమైన ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఆడుతున్న దొంగ నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సొంత సర్వేల్లోనే టీడీపీ, జనసేన గ్రాఫ్‌ పాతాళానికి పడిపోయిందని తేలడంతోనే ప్రజలను మభ్య పెట్టేందుకు ‘రైజింగ్‌ రాయలసీమ’, ‘హార్టికల్చర్‌ హబ్‌’, ‘ఫ్రూట్‌ బౌల్‌’ అంటూ రోజుకో పబ్లిసిటీ స్టంట్‌ తెరపైకి తెస్తున్నారు. ‘మా అల్లుడు మాకన్నా పెద్ద నటుడు’ అని ఆనాడే ఎన్టీఆర్‌ చెప్పారు. ఈ నారా నట సామ్రాట్‌ నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈవీఎంలతో నెగ్గిన సీఎం, డిప్యూటీ సీఎంలకు బ్యాలెట్‌ బాక్సులతో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలంటే భయం పట్టుకుంది. బ్యాలెట్లను మేనేజ్‌ చేయలేమనే భయంతోనే అబద్ధాల ప్రచారం మొదలుపెట్టారు.

బాబు రాకతో సీమకు పట్టిన దరిద్రం:
    రాయలసీమ ప్రజల ఓట్లతో గెలిచి సీమకే వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే మనస్తత్వం ఆయనది. చంద్రబాబు సీఎం అయ్యాక రాయలసీమకు పట్టిన దరిద్రం వల్ల 40 ఏళ్లలో ఎన్నడూ లేని కరువు వచ్చింది. రాష్ట్రంలో 388 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే, అందులో అత్యధికంగా సీమ జిల్లాలే ఉండటం బాబు ఐరన్‌ లెగ్‌కు నిదర్శనం. పంటలు పండక, ఉపాధి లేక రైతులు, కూలీలు పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. 3 వేల నిరుద్యోగ భతి ఇవ్వకుండా, ఉద్యోగాలు కల్పించకుండా యువతను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచింది. ఎన్నికల ముందు ఊగిపోవడం కాదు.. సీమ యువత కష్టాలను గుర్తించి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఒత్తిడి తేవాలి.

తెలంగాణకు రాయలసీమ లిఫ్ట్‌ తాకట్టు..
నిధులన్నీ అమరావతి రియల్‌ ఎస్టేట్‌కే:

    ‘రాయలసీమ బిడ్డనని చెప్పుకునే చంద్రబాబు.. సీమ రైతుల కోసం ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? శ్రీశైలంలో నీళ్లున్నా సీమ రైతులకు ఇవ్వకుండా తీవ్ర ద్రోహం చేస్తున్నారు. ‘రాయలసీమ ప్రాజెక్టును ఆపాం’ అని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి గర్వంగా చెప్తుంటే చంద్రబాబు, పవన్‌ ఎందుకు నోరు మెదపలేదు? హైదరాబాద్‌లోని తమ ఆస్తులను కాపాడుకోవడానికే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టారు. సీమ ప్రాజెక్టుల నిధులను, సంస్థలను అమరావతి రియల్‌ ఎస్టేట్‌ వరదల్లో పోయడానికి తరలిస్తున్నారు. సాగునీటికి 24 వేల కోట్లు పెట్టామంటున్న బాబు.. తన నాలుగు పర్యాయాల పాలనలో ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేసి పూర్తి చేశారా? ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా?.

సిగ్గులేని క్రెడిట్‌ చోరీ..
జగన్‌ తెచ్చిన ప్రాజెక్టులకు బాబు శంకుస్థాపనలా!:

    కుప్పానికి, పిఠాపురానికే నీళ్లు ఇవ్వలేని వాళ్లు పులివెందలకు నీళ్లు ఇస్తామనడం సిగ్గుచేటు. కుప్పం దాహం తీర్చింది వైఎస్‌ జగన్‌ కాదా? పులివెందులలో జగన్‌గారు రూ.480 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు మంజూరు చేసి 80 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 20 శాతం పూర్తి చేయలేని కూటమి ప్రభుత్వం తామే కొత్తగా తెచ్చినట్లు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం. 
    ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాలుగా కిడ్నీ సమస్యకు కారణమవుతున్న తాగునీటి సమస్య అందరికీ తెలుసు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఏ రోజైనా ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారా? కానీ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సమస్యను గుర్తించి సుమారు రూ.700 కోట్లతో తాగునీటి పథకాన్ని తీసుకువచ్చి ఉద్దానం ప్రజలను కిడ్నీ వ్యాధుల నుంచి కాపాడే ప్రయత్నం చేశారు.
    పవన్‌ కళ్యాణ్‌ ఒకసారి ప్రత్యేక విమానంలో వెళ్లి డ్రామా చేసి వచ్చారు. ప్రతి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదని అక్కడి ప్రజలకు తెలుసు. జగన్‌ చేసిన పనికి క్రెడిట్‌ కొట్టేయాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎంత ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు.

వివేకా హత్య కేసుపై సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చినా విష ప్రచారమా?:
    చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌ తారాస్థాయికి చేరింది. ఎన్నిసార్లు కోర్టులు, సీబీఐ మొట్టికాయలు వేసినా ఆయనకు బుద్ధి రావడం లేదు. వైఎస్‌ వివేకా హత్య కేసుతో వైఎస్‌ జగన్‌ గారికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ, కోర్టులు స్పష్టంగా తేల్చాయి. హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబే. ఆనాడు జగన్‌ గారి పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు లేదు? సుప్రీం కోర్టు కూడా పిటిషన్లను కొట్టేసిన తర్వాత కూడా ఇంకా బురదజల్లుతున్నారు. ’నేనే చంపాను’ అని బహిరంగంగా చెప్పిన దస్తగిరి లాంటి నిందితులకు టీడీపీ ఆఫీసుల్లో ఆశ్రయం కల్పిస్తూ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు కాదా? ఎన్టీఆర్‌ మరణానికి, వంగవీటి రంగా హత్యకు కారణమైన వెన్నుపోట్ల చరిత్ర చంద్రబాబుదే.

లిక్కర్‌ పాలసీ పేరిట కూటమి ప్రభుత్వం అతిపెద్ద స్కామ్‌:
    జగన్‌ గారి హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపి, బెల్ట్‌ షాపులను రద్దు చేసి, ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరిస్తే.. దాన్ని లిక్కర్‌ స్కామ్‌ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలు వందల కోట్ల ముడుపులు తీసుకుని విచ్చలవిడిగా లిక్కర్‌ సిండికేట్లను, బెల్ట్‌ షాపులను ప్రోత్సహిస్తున్నారు. 2024 తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్నదే దేశంలోనే అతిపెద్ద లిక్కర్‌ స్కామ్‌. రాబోయే రోజుల్లో దీనిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కచ్చితంగా జైలుకు పంపుతాం. సంక్షేమాన్ని డోర్‌ డెలివరీ చేసిన వాలంటీర్లను పీకేసి, టీడీపీ భజన చేయడానికి పెయిడ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లను తెచ్చారు.

లడ్డూపై అబద్ధాలు బట్టబయలు..
శ్రీవెంకటేశ్వరస్వామికి క్షమాపణ చెప్పాలి:
    మరోవైపు తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ అనుబంధ చార్జ్‌షీట్‌లో స్పష్టంగా తేల్చింది. ఇంకా సుప్రీం కోర్టు, సీబీఐ చివాట్లు పెట్టినా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి పవిత్రతను రాజకీయాల్లోకి లాగినందుకు బాబు, పవన్, అనిత తక్షణమే రాజీనామా చేయడంతో పాటు.. దేవుడి పవిత్రతను మంటగలిపి భక్తుల మనోభావాలు దెబ్బ తీసినందుకు, వైయ‌స్‌ జగన్‌ గారిపై లేనిపోని నిందలు వేసినందుకు స్వామి వారికి, వైయ‌స్ఆర్‌సీపీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆర్‌కె రోజా డిమాండ్‌ చేశారు.

Back to Top