అనంతపురం: నగరంలోని 30వ డివిజన్ మూడో పోలింగ్ బూత్‌లో రీ-పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నిన్న టీడీపీ కూటమి నేతలు రిగ్గింగ్‌కు పాల్పడటంతో ఎన్నికల అధికారులు తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు దౌర్జన్యానికి దిగి, దొంగ ఓట్లు, ఓట్ల సైక్లింగ్‌కు అనుమతించాలని బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రీ-పోలింగ్ కేంద్రం వద్ద ఉండి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. పులివెందుల, జమ్మలమడుగు, కడపలోనూ సమస్యలు పులివెందులలో ఉదయం 6.45 గంటలైనా 8వ రీ-పోలింగ్ కేంద్రం తెరుచుకోలేదని సమాచారం. జమ్మలమడుగులోని 17వ వార్డు పతంగి రామానారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రీ-పోలింగ్ కేంద్రంలో ఉదయం 8.30 గంటలైనా పోలింగ్ ప్రారంభం కాలేదు. కడపలోని జయనగర్ కాలనీ పోలింగ్ కేంద్రం ఓటర్లు లేక వెలవెలబోయింది. మరోవైపు విశాఖ జీవీఎంసీ ఎన్నికల ఓటింగ్ శాతంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి 10 గంటల వరకు 50.2 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించగా, నేడు 56.32 శాతంగా వెల్లడించింది. ఒక్కసారిగా ఆరు శాతానికి పైగా పెరుగుదల రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో బూత్ క్యాప్చరింగ్‌తో రీ-పోలింగ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ వార్డు, పోలింగ్ స్టేషన్ నంబర్ 36/4లో బూత్ క్యాప్చరింగ్ జరిగిన నేపథ్యంలో రీ-పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.