సచివాలయాల్లో నాలుగు పౌర సేవలు నిలిపివేత

కుల, ఆదాయ పత్రాలు, ఇతర సేవల రీ ఇష్యూ, పాస్ బుక్ రీ ప్రింట్ సేవలను ఎందుకు తొలగించారు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ధ్వజం

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ

జగన్ పై ద్వేషంతో సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి ప్రభుత్వ కుట్ర

దశలవారీగా ఒక్కో సేవలను తొలగించి సచివాలయాలను తొలగించే ప్లాన్

కొండా రాజీవ్ గాంధీ స్పష్టీకరణ

కార్పొరేట్లకు సింగిల్ విండో సేవలు.. పేదల సేవకు మొండిచేయి

రాజకీయాలు ఎన్నికల సమయంలో చేసుకోవచ్చు.. ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు

కొండా రాజీవ్ గాంధీ ఆగ్రహం

తొలగించిన ఆ నాలుగు సేవలను తక్షణమే పునరుద్ధరించాలి

లేకుంటే వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్త  ప్రజా ఉద్యమం తప్పదు

రాజీవ్ గాందీ హెచ్చరిక

తాడేపల్లి:  రాష్ట్ర  సచివాలయ వ్యవస్థలో అత్యంత కీలకమైన నాలుగు  సేవలను నిలిపివేయడం ద్వారా సామాన్య ప్రజలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కులధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రజలకు అందుబాటులో ఉన్న ఇతర రి ఇష్యూ సేవలను, రైతుల పాస్ బుక్ రీ ప్రింటింగ్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించడం వెనుక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్ర దాగి ఉందని ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం అవసరమైన  సేవలను సచివాలయ స్థాయిలో అందుబాటులో లేకుండా చేయడం వెనుక కారణమేంటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సాధారణ పత్రాలు కాదని, పేద విద్యార్థుల విద్యాభవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలక ధృవపత్రాల జారీని సచివాలయ సేవలను తలగించడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు తీవ్ర అవస్థలకు గురి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు.  గతంలో ఇలాంటి సర్టిఫికెట్ల కోసం సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, మధ్యవర్తులు, సిఫార్సులు, లంచాల సమస్యల వంటి వాటికి  ముగింపు పలకడానికే జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని కొండా రాజీవ్ గుర్తు చేసారు.  సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సులభంగా అందుతున్న సేవలను నిలిపివేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రజలను పాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితిని తీసుకువస్తోందని విమర్శించారు.  ఒక సామాన్యుడికి కుల ధృవీకరణ పత్రం కావాలంటే ఎక్కడికి వెళ్లాలి?, ఆదాయ ధృవీకరణ పత్రం కావాలంటే ఎవరిని సంప్రదించాలి?, రైతు పాస్‌బుక్ రీప్రింట్ కావాలంటే ఏ కార్యాలయం చుట్టూ తిరగాలి?  అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని  ప్రభుత్వాన్ని కొండా రాజీవ్ గాంధీ ప్రశ్నించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..

జగన్ పై ద్వేషంతో దశలవారీ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఉన్న రాజకీయ కక్ష కారణంగానే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల పాదాల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లాలనే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకుపైగా సచివాలయాలు ఏర్పాటు చేసి, సుమారు 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించి, 540 రకాల పౌర సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే.  అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, దాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేయడం బాధాకరం.  సచివాలయ వ్యవస్థను ఒక్కసారిగా రద్దు చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతో, దశలవారీగా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.  మొదట ఉద్యోగుల సంఖ్య తగ్గించడం, రేషనలైజేషన్ పేరుతో ఇబ్బందులు పెట్టడం, ఉద్యోగులపై అదనపు ఒత్తిడి తీసుకురావడం, వారి సమస్యలను పట్టించుకోకపోవడం, ఇప్పుడు కీలక పౌర సేవలను తొలగించడం వంటివన్నీ సచివాలయ వ్యవస్థ నిర్వర్యం చేసే కుట్రలో భాగమే. సచివాలయానికి వెళ్లినా సేవలు అందని పరిస్థితి సృష్టిస్తే చివరకు ప్రజలు సచివాలయాల వైపు చూడరనే ఆలోచనతో ప్రభుత్వం  ఉంది.

కార్పొరేట్లకు సింగిల్ విండో.. పేద ప్రజలకు మొండిచేయి

వైఎస్సార్‌సీపీపై రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే ఎన్నికల సమయంలో చేసుకోవచ్చు. ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంది.  కానీ రాజకీయ కక్షల కోసం ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలను నిలిపివేయడం మాత్రం అంగీకరించబోము.  ప్రజల సంక్షేమం, పౌర సేవల విషయంలో రాజకీయాలను పక్కనపెట్టి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి.  వెన్నుపోటు పార్టీ కూటమి  అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోంది.  ప్రజలకు పౌర సేవలు అందించాల్సిన సచివాలయ సిబ్బందిని అధికార పార్టీ కార్యక్రమాలకు, ఇంటింటి సర్వేలకు, స్టిక్కర్లు పంపిణీ వంటి రాజకీయ పనులకు ఉపయోగిస్తున్నారు.  దీంతో సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి దాపురించింది.  కార్పొరేట్ సంస్థలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు, భారీ రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం, సామాన్య ప్రజలకు అవసరమైన కనీస పౌర సేవలను ఎందుకు నిలిపివేస్తోందో సమాధానం చెప్పాలి. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచి, పేదలకు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించడం ఏ విధమైన పాలన..?  రాష్ట్రంలో ఉద్యోగ వర్గాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  జూనియర్ డాక్టర్ల ఆందోళనలు, సచివాలయ ఉద్యోగుల ఆందోళనలు, పారామెడికల్ సిబ్బంది సమస్యల విషయంలో ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన కనిపించడం లేదు.  సుమారు 14,500 మందికి పైగా పారామెడికల్ సిబ్బంది తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చానా,  వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంలో చొరవ కనిపించలేదు,.

తక్షణమే ఆ నాలుగు సేవలను పునరుద్ధరించాలి

గ్రామ, వార్డు సచివాలయాల్లో కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, రైతుల పాస్‌బుక్ రీప్రింటింగ్, రీ-ఇష్యూ సేవలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి.  ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేయకుండా మరింత బలోపేతం చేయాలి.   ప్రభుత్వం ఈ సేవలను తక్షణమే పునరుద్ధరించకపోతే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగి ప్రజా ఉద్యమానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ బాధ్యత. రాజకీయ కక్షల కోసం పౌర సేవలను నిలిపివేయడం సరికాదు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి పౌరుడికి ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి అని కొండా రాజీవ్ గాంధీ డిమాండ్ చేశారు.

Back to Top