విజయవాడ: దేవి నగర్ 66వ డివిజన్‌లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘గడప గడపకు వైయస్ఆర్‌సీపీ’ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ కార్పొరేటర్ జానారెడ్డి ఇంటింటికీ వెళ్లి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వయసు నిండినా, భర్త చనిపోయినా పింఛన్లు అందడం లేదని, డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని అన్నారు. రేషన్ బియ్యం కోసం వారం, పది రోజులు తిరగాల్సి వస్తోందని, రేషన్ డిపోల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రేషన్ డిపోల్లో అక్రమాలు, సక్రమంగా బియ్యం పంపిణీ చేయకపోవడంపై జాయింట్ కలెక్టర్‌ను కలిసి చర్యలు కోరుతామని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.35 వేల కోట్ల భారం మోపారని మల్లాది విష్ణు ఆరోపించారు. రైతు బజార్లలో నాసిరకం ఉల్లిపాయల సరఫరాపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాలను పునరాలోచించి సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు, ప్రక్షాళన అవసరమని మల్లాది విష్ణు అన్నారు. ఈవీఎంలలో లోపాలు, అక్రమాలకు సంబంధించిన అంశాలపై ఆధారాలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ శ్రద్ధ చూపాలని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.