అనంతపురం: రాప్తాడు పర్యటనలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రెండున్నరేళ్లలో రాప్తాడుకు ఏం చేశారో చెప్పకుండా పరిటాల పౌరుషం పేరుతో రెచ్చగొట్టడం ఎందుకని ప్రశ్నించారు. రైతులు కరువుతో వలసలు వెళ్తుంటే పేరూరు డ్యామ్‌కు నీళ్లు ఇవ్వకుండా గ్రామాలకు ఎలా వెళ్తారని నిలదీశారు. జిల్లాలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా వాటిపై మాట్లాడకుండా రాజకీయంగా రెచ్చగొట్టే మాటలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై కేసులు, అరెస్టులతో రాజకీయాలు చేయడం ఆపి.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఏమన్నారంటే.. రెండున్నరేళ్లలో రాప్తాడుకు ఏం చేశారు? “రెండున్నరేళ్లలో రాప్తాడు నియోజకవర్గానికి, అనంతపురం జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా పరిటాల రవీంద్ర పౌరుషం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం ఎందుకు? రైతులకు నీళ్లు ఇవ్వకుండా, అభివృద్ధి గురించి మంత్రి నారా లోకేష్ ఒక్క మాట మాట్లాడకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పౌరుషం చూపించాలనడం విడ్డూరం. పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణకు వచ్చి, జిల్లాలోని రైతుల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ ప్రసంగాలు చేయడం వల్ల రాప్తాడుకు ఏం ప్రయోజనం?” పేరూరు డ్యామ్‌కు నీళ్లెక్కడ లోకేష్? “రైతులు కరువుతో అల్లాడుతూ వలసలు పోతుంటే పేరూరు డ్యామ్‌కు నీళ్లు ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకుని గ్రామాలకు వెళ్తారు? వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వరుసగా మూడేళ్లు పేరూరు డ్యామ్‌కు నీళ్లు తీసుకొచ్చాం. రైతులకు నీళ్లు ఇవ్వకుండా పరిటాల రవీంద్ర పౌరుషం గురించి మాట్లాడటం ఏంటి? రైతుల కష్టాలపై ఒక్క మాట కూడా చెప్పని లోకేష్.. రైతులకు ఏం సమాధానం చెబుతారు?” పరిటాల చరిత్ర పేరుతో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలా? “పరిటాల రవీంద్ర పేరు చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టి రాప్తాడును మళ్లీ ఫ్యాక్షన్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా వాటిపై మాట్లాడకుండా రాజకీయంగా రెచ్చగొట్టే మాటలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై కేసులు, అరెస్టులతో రాజకీయాలు చేయడం ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. రాప్తాడు ప్రజలకు కావాల్సింది పౌరుషం మాటలు కాదు.. సాగునీరు, అభివృద్ధి, భరోసా.”