స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం

 రాజకీయ కుయుక్తులు, పోలీసు ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొందాం

వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్య‌క్షుడు కాటసాని రామభూపాల్‌రెడ్డి

బనగానపల్లె: రాబోయే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. బనగానపల్లె జీఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని, రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కాటసాని రామభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ చేసే రాజకీయ కుయుక్తులు, ప్రలోభాలతో పాటు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై చేసే ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని, అవసరమైతే న్యాయపరంగానూ పోరాడాలని సూచించారు.

దివంగత మహానేత వైయ‌స్‌ఆర్‌ రాయలసీమ అభివృద్ధి, సాగునీటి కోసం జీవితాంతం పోరాడారని, గోరకల్లు, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని గుర్తుచేశారు. రాయలసీమకు నీరు అందించేందుకు వైయ‌స్‌ఆర్‌ చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొంటూ.. నేడు రాయలసీమ ఇరిగేషన్‌ గురించి మాట్లాడుతున్న టీడీపీ నాయకులు గతంలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సూచించారు.

ప్రజలే బలం.. కార్యకర్తలే బలమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని కాటసాని రామభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి వార్డులో వైయ‌స్ఆర్‌సీపీని బలోపేతం చేసి, ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, కాటసాని తిరుపాలురెడ్డి, భూమా కిషోర్‌రెడ్డి, కాటసాని ప్రసాద్‌రెడ్డి, మైనారిటీ నాయకులు, సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top