పర్చూరులో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరాలి.. 

స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలబడాలి

వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి పాదయాత్ర

కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలి.. దౌర్జన్యానికి పాలకులు ఎప్పటికీ రాజ్యం చేయలేరు

పర్చూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం

తాడేపల్లి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడి పోరాడాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పర్చూరు నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. పర్చూరు నియోజకవర్గం మీదుగా కూడా పాదయాత్ర సాగుతుందని చెప్పారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

 మాట నిలబెట్టుకున్న పాలన మనది

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలన, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలన మధ్య తేడాపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. ప్రతి కార్యకర్త సగర్వంగా ప్రజల ముందుకు వెళ్లి తమ ప్రభుత్వ పాలన గురించి చెప్పుకోగలిగేలా పాలన సాగించామని తెలిపారు.

మ్యానిఫెస్టోకు ఒక అర్థం తీసుకొచ్చి 99 శాతం హామీలను అమలు చేసిన చరిత్ర వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిదని చెప్పారు. మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌లా భావించి ప్రతి మాటకు కట్టుబడి పనిచేశామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోతో పాటు ప్రతి ఇంటికీ బాండ్లు పంపి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

 ఇంటి గడప వద్దకే ప్రభుత్వ పాలన

ప్రతి ఏటా బడ్జెట్‌ సమయంలోనే పథకాలు, కార్యక్రమాల క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. వ్యవస్థలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.

ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌, ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటి గడప వద్దకే తీసుకెళ్లామని చెప్పారు. రైతులు, పిల్లలు, మహిళలు, పేదలకు అందించే పథకాలను లంచాలు లేకుండా, పూర్తి పారదర్శకంగా అమలు చేశామని వివరించారు.
 
 విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు

ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేశామని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ, ఆరో తరగతి నుంచి డిజిటల్‌ బోర్డులు, బైలింగ్వల్‌ టెక్స్‌ట్‌బుక్స్‌, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించామని చెప్పారు.

ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్ల సంఖ్యను 1,000 నుంచి 3,300కు పెంచామని, రూ.25 లక్షల వరకు వైద్యం అందించేలా పథకాన్ని విస్తరించామని తెలిపారు. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌, నాడు–నేడు ద్వారా ఆస్పత్రుల అభివృద్ధి, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం తీసుకొచ్చామని చెప్పారు.

ఒకేసారి 18 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టామని, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేసి గ్రామాలకు వైద్య సేవలు అందించామని వివరించారు. ఇవన్నీ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగాయని గుర్తుచేశారు.

  రైతులకు కొండంత అండ

రైతులను ఆదుకునేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్లను అందుబాటులో ఉంచామని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. ప్రతి ఎకరాను ఈ–క్రాప్‌ పరిధిలోకి తీసుకొచ్చామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఆర్బీకేల్లో ధరల వివరాలు అందుబాటులో ఉంచామని చెప్పారు.

ఎక్కడైనా పంటలకు సరైన ధర లభించకపోతే సీఎం–యాప్‌ ద్వారా వ్యవసాయ శాఖ సిబ్బంది అప్రమత్తమై, జేసీ స్థాయిలో జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

 ప్రజలను చంద్రబాబు దగా చేశారు

ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సంతకాలతో ప్రతి ఇంటికీ బాండ్లు పంపి అనేక హామీలు ఇచ్చారని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. అమ్మ ఒడి, ఆడబిడ్డ నిధి, రైతులకు ఆర్థిక సాయం, చేయూత, నిరుద్యోగ భృతి వంటి పథకాల పేరుతో భారీగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదని విమర్శించారు.

ఈరోజు ప్రతి ఇంట్లో వైయ‌స్ఆర్‌సీపీ మోసం చేయలేదని, చెప్పిన మాటను నిలబెట్టుకుందని, చంద్రబాబును నమ్మి మోసపోయామని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు.

  స్థానిక ఎన్నికల్లోనూ కుట్రలు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైయ‌స్‌ జగన్‌ ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామా చేసి, కోర్టు ద్వారా అది కొట్టివేయబడుతుందని తెలిసే ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వమే చెబుతోందని ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.

  గట్టిగా నిలబడాలి.. పోరాడాలి

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు సాఫీగా జరిగే పరిస్థితి లేదని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, అరెస్టులు, జైలు వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రోజుకో డ్రామా, రోజుకో నటన, డైవర్షన్‌ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు.

ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా వైయ‌స్ఆర్‌సీపీ ప్రజలకు తోడుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలు సాఫీగా జరిగితే వైయ‌స్ఆర్‌సీపీదే విజయం సాధిస్తుందని, అలా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

  జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం

రాబోయే స్థానిక ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. ప్రజలకు కార్యకర్తలు అండగా నిలుస్తారని, వారికి పార్టీ తోడుగా నిలవాలని చెప్పారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం వంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, వాటిపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం భవిష్యత్‌ సాధారణ ఎన్నికల్లో వ్యక్తమవుతుందని తెలిపారు.

2017లో తన పాదయాత్రకు ముందు నంద్యాల ఉప ఎన్నికలో తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైయ‌స్ఆర్‌సీపీ 35 వేల ఓట్లతో ఓడిపోయిందని గుర్తుచేశారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తమ వైపు తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టగా జనసునామీ వచ్చిందని, 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు.

పాలకుడు మంచి పనులు చేసి వాటిని ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని, అప్పుడు ప్రజలు ఆదరిస్తారని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. అబద్ధాలు, దౌర్జన్యాలతో ఎల్లవేళలా పాలన సాగించలేరని స్పష్టం చేశారు. జరగబోయే కురుక్షేత్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడి గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
 

Back to Top