తిరుపతి: శ్రీవారి భక్తుల విశ్వాసాలతో చంద్రబాబు ఆటలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగానే గతంలో ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన భూమి రద్దు చేస్తునట్లు పైకి చెప్పి, ఆ స్థలంలో టీటీడీ టౌన్ షిప్ కట్టకుండా, స్వర హోటల్ గా పేరు మార్చి 3 వేల కోట్ల విలువైన ఇనాం భూముల్ని కట్టబెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల శ్రీవారికి దశాబ్దాల క్రితం లభించిన ఇనాం భూముల్ని కారు చౌకగా స్వర హోటల్ కు కట్టబెట్టడం ద్వారా భక్తులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, దీనిపై న్యాయపోరాటానికి సిద్దమవుతున్నామని భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ప్రెస్ మీట్లో భూమన కరుణాకర్ రెడ్డి ఇంకేమన్నారంటే... హిందువుల మనోభావాలతో చంద్రబాబు ఆటలు కోట్లాది మంది హిందువుల విశ్వాసాల్ని, మనోభావాల్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ తర్వాత భక్తుల విశ్వాసాలకు తూట్లు పొడుస్తోంది. తిరుపతి జూపార్క్ కు ఇవతల ఉన్న 580, 604 సర్వే నంబర్లలో ఉన్న స్థలం పవిత్రతను కాపాడతామని, భక్తి పారవశ్యత ఉట్టిపడే చర్యలకే దాన్ని వినియోగిస్తామని 2024 నవంబర్ 18న టీటీడీలో తీర్మానం చేసింది. 2025 మే 7న బోర్డు సమావేశంలో దీన్ని ఆమోదించారు. ఆ స్థలంలో భక్తుల కోసం టౌన్ షిప్ ఏర్పాటు చేయాలని, బేస్ క్యాంప్ ప్రాజెక్టు నిర్మించాలని టీటీడీ ఇనాం భూమి 588/ఏను టూరిజం స్థలంతో బదలాయింపు చేయాలని తీర్మానం చేశారు. గతంలో ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన స్థలాన్ని రద్దు చేసి అక్కడ టౌన్ షిప్ నిర్మిస్తామని టీటీడీ చెప్పింది. 2025 అగస్టు 7న ప్రభుత్వం ఈ మేరకు జీవో 22 కూడా ఇచ్చింది. అదే రోజు పర్యాటక భూమి అయిన దీనికి బదులుగా స్వర హోటల్ గా పేరు మార్చుకున్న ముంతాజ్ హోటల్ కు టీటీడీ భూమి ఇచ్చేలా ప్రభుత్వం జీవో నంబర్ 21 ఇచ్చింది. దీనిపై తిరుపతిలో పలువురు ప్రముఖులు, ప్రజలతో పాటు బోర్డు మాజీ ఛైర్మన్ గా నేను కూడా అభ్యంతరం చెప్పాను. కానీ 2025 జూలై 22న నిర్ద్వందంగా ఈ అభ్యంతరాల్ని తిరస్కరించారు. ఆ తర్వాత 2025 డిసెంబర్ 2న ఏపీటీఏ, టీటీడీ ఉమ్మడిగా ఒప్పందం ద్వారా ఈ భూమిని మార్చుకున్నాయి. డిసెంబర్ 13వ తేదీన ఈ భూమిని స్వర హోటల్ గా మార్చుకుంటున్న ఒబెరాయ్ ముంతాజ్ హోటల్ వాళ్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ముంతాజ్ హోటల్ కు స్థలం రద్దు బూటకం మొదట టీటీడీ తీర్మానం ప్రకారం రద్దు చేసిన ముంతాజ్ హోటల్ స్థలంలో టౌన్ షిప్ ఏర్పాటు చేయాలి కాబట్టి, ఆ స్థలం కావాలని తీసుకుంది. అదే నెల 16న జరిగిన టీటీడీ బోర్డు భేటీలో టౌన్ షిప్ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా దీన్ని వెనక్కి తీసుకున్నారు. శిల్ప కళాశాల వద్దే ఈ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తామని తీర్మానం చేశారు. అంటే అక్కడ టౌన్ షిప్ కట్టాలనే ఉద్దేశం వారికి లేదు, కేవలం భక్తులకు ద్రోహం చేయడానికే ఇలా చేశారు. ప్రత్యామ్నాయంగా అలిపిరి పాదాలకు అతి సమీపంలో ఉన్న అత్యంత విలువైన, మార్కెట్ రేటు ప్రకారం 3 వేల కోట్లు విలువ చేసే టీటీడీ ఇనాం భూమిని అప్పగించారు. దీని మీద మేం అభ్యంతరాలు చెప్పినా ఖాతరు చేయలేదు. ఈ ఏడాది జూన్ లో స్వర హోటల్ పైపులైన్ తీసేయడానికి, ఎర్ర చందనం చెట్లు కొట్టేయడానికి అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చారు. ఒబెరాయ్ హోటల్ వారికి స్థలం ఇవ్వాలనుకుంటే అదే రూరల్ మండలంలో కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడి నుంచి రేణిగుంట మండలం వరకూ వందల ఎకరాల స్థలంలో 20 కాకపోతే 30 ఎకరాల స్థలం ఇచ్చేవారు. కానీ వందల సంవత్సరాలుగా టీటీడీ ఆధీనంలో ఉన్న ఇనాం భూమి ఎందుకు అప్పగించిందనే ప్రశ్నకు టీటీడీ వద్ద కానీ, ప్రభుత్వం వద్ద కానీ సమాధానం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏడు కొండల స్థలమంతా టీటీడీదే అని జీవో ఇచ్చారు. అందులో పాద పీఠికలు అన్నీ కూడా దేవుడివే, అక్కడికి వెళ్లే రహదారులు కూడా దివ్యక్షేత్రంలో భాగమేనని 746 జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. తిరుమల దివ్యక్షేత్రం అనే పేరుతోనే ఈ జీవో ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వెలకట్టలేని టీటీడీ స్థలాన్ని ముంతాజ్ హోటల్ కు అప్పగించింది. ప్రైవేటు హోటల్ కు 3 వేల కోట్ల భూములా ? 604 సర్వే నంబర్ లో 20 ఎకరాలు 1953 వరకూ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న స్థలం. దీన్ని డీఫారెస్ట్ చేసి, ఆ తర్వాత ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజీకి అప్పగించారు. అక్కడి నుంచి 1999లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. అందులో 50 ఎకరాలు ఏపీ టూరిజంకు అప్పగించారు. ఇప్పటికీ అక్కడ ఏపీ టూరిజం వారు అక్కడ ట్రైనింగ్ కాలేజీ నిర్వహిస్తున్నారు. కానీ టీటీడీ భూమి అయిన 588/ఏలో ఉన్న స్థలమంతా వందల సంవత్సరాలుగా ఇనాం దారులు టీటీడీకే అప్పగించిన స్థలం. ఇందులో ఏది అత్యంత పవిత్రమైన స్థలం అవుతుంది? రికార్డుల పరంగా చూసినా ముంతాజ్ హోటల్ కు అప్పగించిన స్థలమే మీరు చెప్పిన స్థలం కంటే అత్యంత పవిత్రమైనది అవుతుంది. ఆ దారి అంతా దివ్యక్షేత్రంలో భాగంగా ఉండి తీరాలి. ఏదో మతలబు, అవినీతి ఉంటే తప్ప 3 వేల కోట్లు విలువ చేసే టీటీడీ స్థలాన్ని స్వర హోటల్ కు ఎలా అప్పగించారో చెప్పాలి. అంతే కాదు ఈ హోటల్ కు 58 కోట్ల 69 లక్షల స్టాంప్ డ్యూటీ మినహాయింపు, మార్పిడి దస్తావేజుకు 32 కోట్లు మాఫీ చేశారు. ఇన్ని వేల కోట్ల విలువైన స్థలం మార్పిడి వెనుక విధానమైన పొరబాట్లు జరగలేదు, భక్తుల విశ్వాసాలకు ఉద్దేశపూర్వకంగా చేసిన ద్రోహమే ఉంది. ఏ తీర్మానం ద్వారా వాళ్లు అక్కడ టౌన్ షిప్ ఏర్పాటు చేయాలి కాబట్టి , ఆ స్థలం తమకు కావాలని కోరారో, టీటీడీ దాన్ని అవసరం లేదని, ఆ టౌన్ షిప్ ను శిల్ప కళాశాల వద్దే నిర్మిస్తామని చెప్పడం, వేల కోట్ల స్థలాన్ని ముంతాజ్ హోటల్ కు అప్పగించాలనే ఉద్దేశం తర్వాత మరో అంశం లేదు. ముంతాజ్ హోటల్ కు స్థలం రద్దు చేశామన్న మీ నిర్ణయం ఎక్కడ అమలైంది. అలిపిరిలో ఉన్న స్థలం టీటీడీదే, 588/ఏలో ఉన్న స్థలం కూడా మీదే. మార్పిడి జరిగి ఉంటే అక్కడ టౌన్ షిప్ కట్టి ఉండొచ్చు కదా. ఇలా నిర్ణయాలు మార్చుకోవడం వెనుక కపట ఉపాయం ఉందని అర్దమవుతోంది. టీటీడీ భూమిని ప్రైవేటు వాణిజ్య ప్రయోజనాల కోసం బదలాయించడానికి చేసిన కుట్ర ఇది. ఏ చట్టం ప్రకారం చూసినా ఇది చెల్లదు మోసం చేయడం కోసమే మూడు దశల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. మొదటి దశలో ముంతాజ్ హోటల్ కు ఉన్న 24 ఎకరాల సర్వే నంబర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, తిరుమల ఆధ్యాత్మికత కోసమేనని గొప్పలు చెప్పుకున్నారు. ఆగస్టు 7న దాన్ని రద్దు చేసి, అదే రోజు దాని బదలాయింపుకు మరో జీవో ఇచ్చారు. స్వతంత్ర, వృత్తిపరమైన మదింపు లేకుండా దీన్ని మార్పిడి చేసారు. ప్రజల సంప్రదింపులు, నోటీసులు లేకుండా టీడీపీ చేసిన ఈ బదలాయింపుల వల్ల జరిగిన ప్రయోజనం ఏంటో చెప్పకుండా అభ్యంతరాలు తిరస్కరించారు. దానికీ కారణాలు చెప్పలేదు. టీటీడీ బోర్డులోనూ ఒకరిద్దరు వ్యతిరేకించినా లెక్క చేయలేదు. అంటే ఓవైపు పవిత్రత కాపాడే పేరుతో జీవోలు రద్దు చేశారు, మరోవైపు అదే పవిత్రత దెబ్బతీసేందుకు టీటీడీ స్థలాన్ని స్వర హోటల్ కు అప్పగించారు. మోసపూరిత మార్పిడి ద్వారా చేజిక్కించుకున్న ప్రభుత్వ భూమిని ఏపీ టూరిజం వారికి కేటాయించడం వల్ల ముంతాజ్ హోటల్ కాస్తా పేరు మార్చుకుని స్వర హోటల్ గా మారిపోయింది. ఓనర్లు మాత్రం మారలేదు. దీని వల్ల టీటీడీ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 450 కోట్లు, బహిరంగ మార్కెట్లో 3 వేల కోట్లు కోల్పోయింది. అంత ఖరీదైన స్థలం టీటీడీకి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. టీటీడీకి లభించింది 25 కోట్ల విలువ చేసే ఆ టూరిజం భూమి మాత్రమే. ఇంత దారుణం జరుగుతుంటే గతేడాది డిసెంబర్ 2న జరిగిన మార్పిడి ద్వారా వేంకటేశ్వర స్వామి ట్రస్టును మోసం చేసేందుకు చేసిన కుట్రను ఇది బయటపెడుతోంది. మార్పులు చేస్తున్న రెండు భూముల ధరలు వేర్వేరుగా ఉన్నాయని దస్తావేజు స్పష్టంగానే అంగీకరిస్తోంది. ఏ భూమికీ వాస్తవ ధరను పేర్కొనకుండా వదిలేశారు. ఇది పొరబాటు కాదు, భూముల విలువలో ఉన్న భారీ వ్యత్యాసాన్ని కావాలని తొక్కిపెట్టారు. చట్ట ప్రకారం ఇది చెల్లదు. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం, ఆస్తి బదిలీ చట్టాల ప్రకారం మార్పిడి చేస్తున్న ఆస్తుల విలువను దస్తావేజులో తప్పనిసరిగా పేర్కొనాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ప్రతిఫలం పేర్కొనబడని దస్తావేజు కేవలం మోసపూరితమైన కుట్రే. తిరుమల పవిత్రతకు తీరని వెన్నుపోటు పొడిచారు. వేంకటేశ్వరస్వామి ఆస్తుల్ని సైతం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. దీనిపై మేం న్యాయపోరాటానికి సిద్దమవుతున్నాం. ఇది 120 కోట్ల మంది హిందువుల గుండెల్లో చంద్రబాబు గుచ్చిన గునపం ఇది. వారికి వెన్నులో పొడిచిన వెన్నుపోటు ఇది అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.