నిరుద్యోగులపై కేసులు.. అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రవిచంద్ర హెచ్చరిక

విజ‌య‌వాడ‌: పోలీస్‌ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ కాకినాడలో ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగ అభ్యర్థులు, శ్యామ్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు శ్యామ్‌ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రవిచంద్ర మండిపడ్డారు. నిరుద్యోగులపై అక్రమ కేసులు, వేధింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని హెచ్చరించారు.

నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసుల అక్రమ కేసులను నిరసిస్తూ, పోలీస్‌ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం బాలోత్సవ భవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ.. పోలీస్‌ శాఖలో 11,630 పోస్టులు భర్తీ చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు కేవలం 1,669 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించి నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచించిందని పేర్కొన్నారు.  ఇచ్చిన హామీని అమలు చేయాలని ర్యాలీ నిర్వహించిన అభ్యర్థులపై కేసులు పెట్టి వేధించడం తగదని రవిచంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా పోలీస్‌ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని తెలిపారు. భర్తీ చేసిన 6,100 పోస్టులు కూడా గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినవేనని, వాటికి పరీక్షలు నిర్వహించి కూటమి ప్రభుత్వం క్రెడిట్‌ చోరికి పాల్పడిందని పేర్కొన్నారు.

నిరుద్యోగ అభ్యర్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పోలీస్‌ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ రాష్ట్ర డీజీపీని కలుస్తామని రవిచంద్ర తెలిపారు. ప్రభుత్వ కేసులు, బెదిరింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం విద్యార్థి, యువజన సంఘాలన్నీ కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాయని హెచ్చరించారు.
 

Back to Top