జర్నలిస్టుల అరెస్టు అక్రమం.. అన్యాయం

 అర్ధరాత్రి వేళ ఐ టీవీ న్యూస్‌ జర్నలిస్టుల అరెస్టు దుర్మార్గం

 మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్‌ బాషా  ఆగ్రహం

నంద్యాల‌: ఐ టీవీ న్యూస్‌ జర్నలిస్టులు నాగచంద్రుడు, సురేష్‌లను అర్ధరాత్రి వేళ అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్‌ బాషా తీవ్రంగా ఖండించారు. బాధిత జర్నలిస్టుల కుటుంబాలను పరామర్శించిన వారు.. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిస్టులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇళ్ల తలుపులు బద్దలు కొట్టే విధంగా భయాందోళనలు సృష్టించి అరెస్టు చేయడం దుర్మార్గమని వారు మండిపడ్డారు. జర్నలిస్టులను అరెస్టు చేయడానికి వారేమైనా ఉగ్రవాదులా? దేశద్రోహులా? అని ప్రశ్నించారు. మంత్రి ఫరూక్‌ తనయులపై ఐ టీవీలో వచ్చిన ‘లోగుట్టు’ కథనంలోని అంశాలు నిజాలు కావా? అని ప్రశ్నించారు. అధికారిక సమావేశాల్లో మంత్రి కుమారులు పాల్గొంటున్నారనడానికి ఆధారాలు ఉన్నాయని, ప్రజాప్రతినిధులపై వార్తలు రాయడం జర్నలిస్టుల బాధ్యత అని స్పష్టం చేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప.. కిడ్నాప్‌ చేసినట్లు ఎత్తుకెళ్లడం సరికాదన్నారు.

ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వం

కూటమి పాలనలో ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతును నొక్కిపెట్టడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను, విలేకరులను వరుసగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో రమణ, నంద్యాలలో జాకీర్‌ వంటి జర్నలిస్టులపై గతంలో జరిగిన దాడులను ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వ తొత్తులుగా మారి పావులుగా ఉపయోగపడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో చూపని దూకుడును జర్నలిస్టులను వేధించడంలో చూపడం దారుణమని, పోలీసు వ్యవస్థ తన స్వతంత్రతను కోల్పోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై వేధింపులను తక్షణమే ఆపి, వారిపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు స్పష్టం చేశారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలోనే ప్రజలు ఈ అరాచక పాలనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
 

Back to Top