మా హుందాతనాన్ని చేతకానితనం అనుకోవద్దు

జ‌గన్‌ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోం

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్‌ రెడ్డి హెచ్చరిక

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి వీరశేఖర్‌ రెడ్డి

మీకు ధీటుగా వైయ‌స్ఆర్‌సీపీ అదే భాషలో బదులివ్వగలదు

లోకేశ్‌ బాగోతాలన్నీ బయటపెట్టడం మొదలెడితే తట్టుకోలేవు

స్కిల్‌ కేసులో జైలు జీవితం గడిపి సెలబ్రేట్‌ చేసుకోవడం సిగ్గుచేటు

అనారోగ్య కారణం చూపించి బెయిల్‌ పై వచ్చిన విషయం ప్రజలకు తెలుసు

నిజాయితీగా కేసులను ఎదుర్కొని బయటకొచ్చే దమ్ము చంద్రబాబుకి లేదు

అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులను తొలగించేసుకుంటున్నాడు

ప్రెస్‌మీట్‌లో వీరశేఖర్‌రెడ్డి ఆక్షేపణ

తాడేపల్లి: వైయ‌స్‌ జగన్‌ గారిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని, తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్‌ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వంటి అనేక స్కామ్‌లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్‌ బెయిల్‌పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్టŠస్‌ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ప్రెస్‌మీట్‌లో వీరశేఖర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:
వైయ‌స్‌ జగన్‌ గారి వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి. కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.

అరెస్టును సెలబ్రేట్‌ చేసుకోవడం సిగ్గుచేటు:
2014 నుంచి 2019 మధ్య ఫైబర్‌నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్, అమరావతి అసైన్డ్‌ భూములు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్‌ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్‌లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్‌ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు. కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్‌ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్‌ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్‌ చేసుకుంటాడు?  ఆయన మెడికల్‌ గ్రౌండ్స్‌పై బెయిల్‌ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ పేరుతో తొలగించేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.

లోకేశ్‌ బాగోతం బయట పెట్టమంటారా?:
జగన్‌ గారు చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్‌సిక్‌తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. జగన్‌ గారి వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్‌కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.

దస్తగిరి టీడీపీ ఆఫీస్‌కు ఎందుకు వెళ్లారు?:
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత జగన్‌ గారి గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top