అమూల్య నర్సింగ్‌ హోమ్‌లో రూ.100 కోట్ల అక్రమాలు 

ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుపై కేసు పెట్టి అరెస్ట్‌ చేయాలి

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

పల్నాడు జిల్లా: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అమూల్య నర్సింగ్‌ హోమ్‌లో రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ఎల్‌ఓసీలను అడ్డుపెట్టుకుని ప్రజలు, ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు నిర్వహించి, అదే కేసులను తిరిగి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పెట్టి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు చెందిన అమూల్య నర్సింగ్‌ హోమ్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టారని తెలిపారు. ఎమ్మెల్యేకు ఏడుగురు పీఏలు ఇష్టారాజ్యంగా సెటిల్‌మెంట్లు చేస్తున్నారని, ఇవన్నీ ఎమ్మెల్యేకు తెలియకుండా జరగవని అన్నారు.

ఇలాంటి స్కామ్‌లు నరసరావుపేటకే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ఎల్‌ఓసీల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని గోపిరెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ఎల్‌ఓసీలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అమూల్య నర్సింగ్‌ హోమ్‌ వ్యవహారంతో పాటు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుపై సమగ్ర దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. ఇలాంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నందుకు నరసరావుపేట ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
 

Back to Top