ఇవి కచ్చితంగా గెలవాల్సిన ఎన్నికలు

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

రాప్తాడు: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాప్తాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని, గ్రామస్థాయి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థవంతమైన అభ్యర్థులను ఎంపిక చేసి వారి విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. “ఇవి సాధారణ ఎన్నికలు కావు.. కచ్చితంగా గెలవాల్సిన ఎన్నికలు. ప్రతి స్థానంలో సరైన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలి. అందుకు మీకు పూర్తి అండగా ఉంటాం” అని భరోసా ఇచ్చారు.

రాప్తాడు నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న కరువు, సాగునీరు, విద్యుత్ సమస్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక బోర్లు ఎండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసినా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని తెలిపారు. హంద్రీ-నీవా కాలువల అభివృద్ధి, పేరూరు డ్యామ్‌కు నీరు అందించడం, భూగర్భ జలాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి భూగర్భ జలాలను కాపాడాలని కోరారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం, గ్రామస్థాయిలో ప్రజలకు అండగా నిలవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం సాధించాల్సిన అవసరం ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top