కూటమి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువు

కళ్యాణదుర్గం పాఠశాల ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి

చంద్రశేఖర్ యాదవ్

అనంతపురం : కళ్యాణదుర్గం నార్త్ జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు రామచంద్ర నాయక్ అసభ్యంగా ప్రవర్తించి, అనుచితంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ డీఈఓ అయూబ్ హుస్సేన్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థినులు, మహిళల భద్రతకు సంబంధించిన అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థినులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం మహిళల భద్రతపై గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని, విద్యార్థినుల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై విద్యార్థులు ఉంచే నమ్మకాన్ని దుర్వినియోగం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.

విద్యార్థినుల ఆత్మగౌరవం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రశేఖర్ యాదవ్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. విద్యార్థినులు ధైర్యంగా తమ సమస్యలను అధికారులకు తెలియజేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టి, ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు కైలాష్, కార్యదర్శులు జగన్ యాదవ్, విజయ్, బబ్లు, నంద, శేఖర్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top