గుడివాడ : ఆంధ్రప్రదేశ్‌లో వరి తర్వాత విస్తృతంగా సాగయ్యే ప్రధాన పంటల్లో పత్తి అత్యంత ముఖ్యమైన వర్షాధార పంట అని, ప్రభుత్వం నుంచి సాగునీటి సౌకర్యం, కనీసం విత్తన సబ్సిడీ కూడా లేకుండా రైతులు ఎంతో కష్టపడి ఈ పంటను సాగు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్‌చైర్మన్, భారత వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ సభ్యుడు యం.వి.యస్. నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్సార్ కడప, పల్నాడు, గుంటూరు, ఎన్‌టీఆర్, మార్కాపురం తదితర జిల్లాల్లో వేలాది మంది రైతులు వర్షాలపై ఆధారపడి పత్తి సాగు చేస్తున్నారని, అయితే 2026 ఖరీఫ్ ప్రారంభం నుంచి కొనసాగుతున్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు పత్తి పంటను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయని పేర్కొన్నారు. 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 471.1 మి.మీ. కాగా, వాస్తవ వర్షపాతం కేవలం 213.0 మి.మీ. మాత్రమే నమోదైందని, రాష్ట్రవ్యాప్తంగా 54.8 శాతం వర్షపాతం లోటు ఉందని తెలిపారు. 28 జిల్లాల్లోనూ వర్షపాతం లోటు నమోదైన పరిస్థితి పత్తి వంటి వర్షాధార పంటలకు అత్యంత ప్రమాదకరమని వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సెప్టెంబర్ 9 నాటి నివేదిక ప్రకారం 2026 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 4.10 లక్షల హెక్టార్లలో, అంటే 80 శాతం మేర పత్తి సాగు జరిగిందని, గత ఏడాది ఇదే సమయానికి 4.27 లక్షల హెక్టార్లు ఉండగా ఈ ఏడాది సుమారు 17 వేల హెక్టార్ల మేర సాగు తగ్గిందని తెలిపారు. కర్నూలులో సాధారణంగా సుమారు 2.34 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని, రాష్ట్ర మొత్తం పత్తి సాగులో 57.07 శాతం ఈ జిల్లాలోనే ఉందని, జూన్‌లో వర్షాలు కురవడంతో మొత్తం సీజన్ సరాసరి సాగులో 98 శాతం సాగు జరిగినప్పటికీ ప్రస్తుతం 46.5 శాతం వర్షపాతం లోటు పంట ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. నంద్యాలలో 10 వేల హెక్టార్లు, వైఎస్సార్ కడపలో 9 వేల హెక్టార్లు, అనంతపురంలో 28 వేల హెక్టార్లు, గుంటూరులో 18 వేల హెక్టార్లు, పల్నాడులో 60 వేల హెక్టార్లు, ఎన్‌టీఆర్ జిల్లాలో సెప్టెంబర్ 8 నాటికి 23 వేల హెక్టార్లు, మార్కాపురంలో 9.6 వేల హెక్టార్లలో పత్తి సాగు జరిగినట్లు తెలిపారు. నంద్యాలలో 54.7 శాతం, వైఎస్సార్ కడపలో 58.9 శాతం, అనంతపురంలో 48 శాతం, ఎన్‌టీఆర్ జిల్లాలో 46.3 శాతం, మార్కాపురంలో 60.3 శాతం వర్షపాతం లోటు నమోదైందని వివరించారు. ఉత్తరాంధ్రలో విజయనగరంలో 2.2 వేల హెక్టార్లు, పార్వతీపురం మన్యంలో 7 వేల హెక్టార్లలో కూడా పత్తి సాగు జరుగుతున్నప్పటికీ అక్కడా వర్షపాతం సాధారణం కంటే గణనీయంగా తక్కువగా ఉందన్నారు. పత్తి పంటకు విత్తనం మొలకెత్తిన తర్వాత మొక్క ఎదుగుదల, పూత, కాయ ఏర్పడే దశల్లో తగినంత నేల తేమ అవసరమని, ప్రస్తుతం దీర్ఘకాలిక పొడి వాతావరణం, నేలలో తేమ తగ్గడం వల్ల పంట తీవ్ర ఒత్తిడికి గురవుతోందని యం.వి.యస్. నాగిరెడ్డి తెలిపారు. వర్షం ఆలస్యం కావడం, ఆలస్యంగా విత్తడం, మొలక దశలో తేమ కొరత, దీర్ఘకాలిక పొడి వాతావరణం, మొక్క ఎదుగుదల తగ్గడం, పూత, కాయలపై ప్రభావం పడటం చివరకు దిగుబడి తగ్గే ప్రమాదానికి దారితీస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా పూత, కాయ ఏర్పడే దశల్లో తేమ కొరత కొనసాగితే దిగుబడిపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, పంట బీమా క్లెయిమ్‌లు, అన్నదాత సుఖీభవ బకాయిలు తదితరాలను వెంటనే చెల్లించాలని, పత్తి సాగు మండలాల వారీగా తక్షణ పంట పరిస్థితి సర్వే నిర్వహించి ఎండిపోయిన, తీవ్రంగా దెబ్బతిన్న పత్తి పంటకు నష్టం అంచనా వేయాలని కోరారు. వర్షాభావంతో పంట దిగుబడి తగ్గే రైతులకు ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ ప్రకటించి, పత్తి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని, పత్తి కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధర లభించేలా సీసీఐ కొనుగోలు కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. పత్తి నాణ్యత పేరుతో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం పర్యవేక్షించాలని, వర్షాలు పూర్తిగా విఫలమైన మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పంట బీమా పరిధిలో ఉన్న రైతులకు నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిహారం అందించాలని స్పష్టం చేశారు. రైతుకు సహాయం చేయడం దయ కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని యం.వి.యస్. నాగిరెడ్డి పేర్కొన్నారు.