డీఎస్సీ అక్రమాల్లో వెలుగులోకి మరిన్ని వాస్తవాలు

దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీల్లా ఉద్యోగాలు

శ్రీ వైయ‌స్‌ జగన్‌ ఫైర్‌

ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు

అయినా వాటిని కప్పి పుచ్చుకునే కుతంత్రం

అధికారుల ద్వారా కవరప్‌ చేసుకునే ప్రయత్నం

:శ్రీ వైయ‌స్‌ జగన్‌ ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్న డీఎస్సీ స్కామ్‌. అందులో పూర్తి వాస్తవాలపై ఆధారాలతో సహా మాట్లాడిన శ్రీ వైయ‌స్‌ జగన్‌.

ఏడు సార్లు సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ అంటూ కబుర్లు

అయినా యథేచ్ఛగా ఫేక్‌ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి?

:సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయ‌స్‌ జగన్‌

జరగని పోటీలు, టోర్నీలు చూపి సర్టిఫికెట్లు జారీ

ఆ సర్టిఫికెట్లు బోగస్‌ అంటూ అసోసియేషన్ల వెల్లడి

అయినా పట్టించుకోని వెన్నుపోటు కూటమి ప్రభుత్వం

అడ్డగోలుగా తమవారికి ఉద్యోగాల కల్పన. ఆ తర్వాత గేట్స్‌ క్లోజ్‌

:శ్రీ వైయ‌స్‌ జగన్‌ వెల్లడి

అసలు ఏ పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు

అందులోనూ టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్‌

కొత్త జీఓలు జారీ చేయడం.. ఉద్యోగాలు ఇవ్వడం..

ఆ వెంటనే ఆ జీఓలు రద్దు చేస్తూ మరిన్ని జీఓలు

ఈ స్థాయిలో గతంలో ఎక్కడా అక్రమాలు జరగలేదు

:గుర్తు చేసిన శ్రీ వైయ‌స్‌ జగన్‌

అదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

డీఎస్సీ స్కామ్‌ బయట పడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్‌

మిగిలిన ఉద్యోగాలకూ నియామకాలు చేపట్టని వైనం

ఈ స్థాయిలో అక్రమాలు చేస్తే ప్రభుత్వ వ్యవస్థల పతనం

ప్రజలకు వాటిపై నమ్మకం ఎలా కలుగుతుంది?

ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా?

:ప్రెస్‌మీట్‌లో నిలదీసిన శ్రీ వైయ‌స్‌ జగన్‌

తాడేపల్లి: డీఎస్సీ అక్రమాల్లో వెలుగులోకి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీల్లా ఉద్యోగాలు ఇచ్చేశారని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతున్నా వాటిని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అధికారుల ద్వారా వాటిని కవరప్‌ చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఏడు సార్లు సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ చేశామంటూ అధికారుల కబుర్లు చెబుతున్నారని, అయినా అన్ని ఫేక్‌ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జరగని పోటీలు, టోర్నీలు చూపి సర్టిఫికెట్లు జారీ చేశారని, అవి బోగస్‌ అంటూ అసోసియేషన్ల వెల్లడించినా, వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా, తమ వారికి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చి, ఆ తర్వాత గేట్స్‌ క్లోజ్‌ చేశారని వెల్లడించారు.

అసలు ఏ పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్‌ అని శ్రీ వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. కొత్త జీఓలు జారీ చేయడం.. ఉద్యోగాలు ఇవ్వడం..
ఆ వెంటనే ఆ జీఓలు రద్దు చేస్తూ మరిన్ని జీఓలు ఇవ్వడం.. ఈ స్థాయిలో గతంలో ఎక్కడా అక్రమాలు జరగలేదని చెప్పారు. ఇంకా అదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, డీఎస్సీ స్కామ్‌ బయట పడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్‌ వేయడమే కాకుండా, మిగిలిన ఉద్యోగాలకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయ‌స్‌ జగన్‌ ప్రశ్నించారు.

ప్రెస్‌మీట్‌లో శ్రీ వైయ‌స్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

తవ్వినకొద్దీ అక్రమాలు. ప్రశ్నిస్తే కేసులు:

డీఎస్సీలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఇంకా ఇంకా బయటపడుతున్న వాస్తవాలు నివ్వెరపోయేలా ఉన్నాయి. ఆ స్థాయిలో ఆధారాలు బయటకు వస్తున్నాయి. తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబునాయుడుగారిలో బీపీ పెరుగుతోంది. అది ఏ స్థాయిలో ఉందంటే, ఎవరైనా ఆధారాలు గనుక చూపించి ఇవిగో ఆధారాలు అంటే కేసులు పెట్టడం, జైలులో వేస్తామని బెదిరించడం జరుగుతోంది. ఇందులో చివరకు జర్నలిస్టులను కూడా వదలడం లేదు. అసలు జర్నలిజం అంటేనే తప్పులు జరిగిన చోట ఆధారాలతో సహా చూపించగలగడం. కానీ జర్నలిస్టులను సైతం వదలకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు.

మరోవైపు సోషల్‌ మీడియాలో ఎవరైనా వాటిని చూపించి ప్రశ్నిస్తే వారి అకౌంట్లు బ్లాక్‌ చేస్తున్నారు. ఇది కచ్చితంగా అప్రజాస్వామిక చర్య. ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారనడానికి ఇవన్నీ అద్దం పడుతున్నాయి.

ఇవీ డీఎస్సీ స్కామ్‌ పునాదులు.
ఇప్పుడైనా ఈ ప్రశ్నలకు బదులిస్తారా?:

డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి గత ప్రెస్‌మీట్‌లో నేను అడిగిన వాటిలో ఒక్క ప్రశ్నకు కూడా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. చంద్రబాబునాయుడు కానీ, ఆయన కుమారుడు కానీ వాటిపై స్పందించలేదు. అవన్నీ డీఎస్సీ స్కామ్‌ పునాదులు. అందుకే ఆ ప్రశ్నలు మళ్లీ సంధిస్తున్నాను. ఇప్పుడైనా సమాధానం చెబుతారా?

ప్రశ్న–1:

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ప్రశ్నపత్రాల తయారీ, డీఎస్సీ పరీక్షల నిర్వహణ.. ఈ రెండు డ్యూటీలు ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?.

ఇక్కడే స్కామ్‌ ద్వారాలు తెరవబడ్డాయి. వీటికి సంబంధించి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు.

ప్రశ్న–2:

ప్రశ్నపత్రాలు తయారుచేసే ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) విభాగంలో ఔట్‌ సోర్సింగ్‌లో పని చేసే నవీన్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌ ఎలా వచ్చింది? ఆ వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతడి పేరున్న మెరిట్‌ లిస్టును ఎందుకు మార్చారు? రెండో లిస్టులో అతడి పేరు ఎందుకు లేదు?.

అతడి ఐడీ ఎందుకు బ్లాక్‌ చేశారు. లాగిన్‌ను ఎందుకు బ్లాక్‌ చేశారు? దానిపై అతడు ఫిర్యాదు కూడా చేశాడు. అతణ్ని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు? అతడు మెగా డీఎస్సీ కన్వీనర్‌కు లేఖ కూడా రాశాడు. ఇంకా కోర్టును కూడా ఆశ్రయించాడు. ఆ మేరకు అఫిడవిట్‌ కూడా ఉంది. ఈ స్కామ్‌ను దాచి పెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా ఇదంతా?. ఇంకా డీఎస్సీలో క్వశ్చన్‌ పేపర్‌ అమ్మారని సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవుతోంది?. దీనికేం చెబుతారు?.

ప్రశ్న–3:

ఇంతకు ముందు ఉన్న స్పోర్ట్స్‌ కోటా జీఓను మార్చి, 372 పోస్టులు అసలు పరీక్ష కూడా రాయాల్సిన అవసరం లేకుండా మరో జీఓ ఎలా ఇచ్చారు. అలాగే 2 శాతం రిజర్వేషన్‌ను 3 శాతానికి పెంచారు. పరీక్ష కూడా అవసరం లేదని ఎందుకు చెప్పారు. ఆ మేరకు కొత్తగా జీఓ నెం:4 మరియు 47 జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్‌ చేయడానికి వీలు కల్పిస్తూ, ఈ రెండు జీఓలు ఎందుకు తెచ్చారు? ఈ రెండు జీఓలతో గేట్లు ఎత్తి, 372 మందిని రిక్రూట్‌ చేసి, పని అయిపోగానే, ఈ రెండు జీఓలు ఉపసంహరిస్తూ.. కొత్తగా జీఓ నెం:23, 25 మరియు 56 జారీ చేశారు. అంటే ఆ గేట్లు మూసేస్తూ, ఈ మూడు జీఓలు జారీ చేశారు.

ఎందుకింత అడ్డగోలుగా జీఓలు ఇచ్చారు. 372 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్ష కూడా రాయకుండా ఎలా ఇచ్చారు?. అలా స్కామ్‌లు చేస్తూ, మీ ఇష్టం వచ్చిన వారికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు? మీ పని కాగానే, ఆ జీఓలు ఎందుకు ఉపసంహరించారు?.

ప్రశ్న–4:

టీచర్‌ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ, ఆడియో, వీడియో కాల్స్‌ వివరాలు బయటకు వచ్చినా కూడా, దానిపై విచారణను ఎందుకు నిర్వీర్యం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది మొదలు, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపే వరకు కేసును మొత్తం నిర్వీర్యం చేశారు.

(అంటూ ఆ ఆడియో, వీడియో (ఫోన్‌ కాల్‌) మీడియాకు పీపీటీలో ప్రదర్శించి చూపారు)

ఇక్కడ చాలా స్పష్టంగా ఫోన్‌ నెం:94407 55843 కనిపిస్తోంది. ఆ నెంబర్‌ అంత స్పష్టంగా ఉన్నా, అది ఎవరిదో పోలీసులు కనుక్కోలేరా? పైగా ఎఫ్‌ఐఆర్‌లో ఏం రాశారు? పేరు రాయకుండా, సస్పెక్ట్‌ అని మాత్రమే రాశారు. అలాగే ఎందుకు ఆలస్యం అయిందంటే, ఉన్నతాధికారుల నుంచి క్లియరెన్స్‌ రాలేదని చెప్పారు.

పైగా దీనిపై చంద్రబాబు, ఆయన కుమారుడు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి, జైలుకు పంపామని చెప్పారు. కానీ, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే అది క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకియంగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ (సీసీటీఎన్‌ఎస్‌)లో ఉంది.

కనీస పశ్చాతాపం లేదు:

అంటే ఉద్దేశపూర్వకంగా కేసును పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పడానికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు. నేను అడిగినవన్నీ చాలా సింపుల్‌ ప్రశ్నలు. ఆరేళ్ల పిల్లాడికైనా కూడా అర్ధమవుతాయి. అయినా వాటికి ఔనా, కాదా అన్న సమాధానం మాత్రం రాదు.

ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు, ఆయన కుమారుడు తప్పు చేశారు. దాన్ని బుల్డోజ్‌ చేస్తున్నారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అయినా ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం లేదు.

చంద్రబాబు స్కామ్‌ల చరిత్రలో ఇదొక ఆణిముత్యం:

ఇప్పుడు ఈ డీఎస్సీ స్కామ్‌లో వరసగా కేస్‌ స్టడీలు బయటకు వస్తున్నాయి. అవి చూస్తుంటే రోమాలు నిక్క బొడుచుకుంటున్నాయి. పై నుంచి ఆదేశాలు. కింద అవినీతి వ్యవహారాలు. అలా వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతోంది. బాబు స్కామ్‌ జాబితాలో ఇది ఒక ఆణిముత్యంలా మిగిలిపోతుంది. నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన స్కామ్‌గా చిరస్థాయిగా నిల్చిపోతుంది.

ఏ పరీక్ష రాయకుండానే, వీళ్లే స్పోర్ట్స్‌ సర్టిఫికెట్స్‌ ఇవ్వడం, మళ్లీ వాళ్లే వాటిని కన్ఫామ్‌ చేయడంతో పాటు, వాటి ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా కొన్ని చూస్తే, జరగని పోటీలు జరిగినట్లు చూపారు. ఇంకా వాటిలో అద్భుత పనితీరు చూపినట్లు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు. అలా పైస్థాయి నుంచి ఆదేశాలతో కిందిస్థాయి వరకు కుమ్మక్కై ఒక మోడస్‌ ఆపరాండి ప్రకారం ఈ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేశారు. అలా ఈ స్కామ్‌ చేశారు.

ఈ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వాలి అంటే?
ఫేక్‌ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు. కొన్ని కేస్‌ స్టడీస్‌:

అసలు ఈ కేసును సీబీఐకి ఎందుకివ్వాలి అంటే, ఆ స్థాయిలో అక్రమాలు జరిగాయి. యథేచ్ఛగా ఫేక్‌ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇందులో అంతులేని అక్రమాలు చేశారు.

జూడో కేటగిరీ:

ఈ డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో 372 మందిని నియమిస్తే, ఒక్క జూడో కేటగిరీలోనే మొత్తం 39 మందికి పరీక్ష లేకుండానే పోస్టింగ్‌ ఇచ్చారు. వారిలో కొందరు సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూడో ఛాంపియన్‌షిప్‌ 2013లో ఖమ్మంలో జరిగినట్లు, వాటిలో తాము పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు పెట్టారు.

అయితే ఆ పోటీలు తాము నిర్వహించలేదని, అవి అసలు జరగలేదని జిల్లా జూడో అసోసియేషన్, తెలంగాణ జూడో అసోసియేషన్‌ స్పష్టంగా చెప్పాయి. ఆ తేదీల్లో తామసలు ఏ పోటీలు నిర్వహించలేదని తేల్చి చెప్పాయి.

ఇక్కడ ఏపీ జూడో అసోసియేషన్‌ అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌. అంటే దొంగ సర్టిఫికెట్లు సృష్టించడం, వాటి ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం. ఇవన్నీ సాక్ష్యాలు, ఆధారాలతో చూపుతున్నాం.

సాఫ్ట్‌బాల్‌:

సాఫ్ట్‌బాల్‌ పేరిట మరో 38 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఆ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌.

ఇక్కడ ఎంపికైన 38 మందిలో 21 సర్టిఫికెట్లు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఇచ్చారు.

ఫేక్‌ సర్టిఫికెట్స్‌. ‘శాప్‌’ వ్యవహారం:

మరికొన్ని కేసుల్లో శాప్‌ స్వయంగా చక్రం తిప్పింది.

విశాఖలో ఏ పరీక్ష రాయకుండానే, యోగేశ్వవరావు అనే అభ్యర్థికి స్పోర్ట్స్‌ కేటగిరీలో ఎస్‌జీటీ పోస్టు ఇచ్చారు. ఆయనకు ఒక్కడికే కాకుండా ఆయన చెల్లికి కూడా అదే కేటగిరీలో ఉద్యోగం ఇచ్చారు. ఇది ఫ్యామిలీ ప్యాకేజీ.

నల్లగొండలో జరిగిన 23వ సీనియర్‌ సౌత్‌ నేషనల్‌ ఖోఖో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో (2009) యోగేశ్వరరావు ఫస్ట్‌ ప్లేస్‌లో రాగా, ఆయన చెల్లి సెకండ్‌ ప్లేస్‌లో వచ్చినట్లు సర్టిఫికెట్లు ఇచ్చారు. అయితే వీరు అసలు విజేతల జాబితాలో లేరని, తెలంగాణ ఖోఖో అసోసియేషన్‌ ప్రకటించింది. ఆ మేరకు వివరాలు కూడా అసోసియేషన్‌ వెల్లడించింది.

(అంటూ ఆ వివరాలు ప్రెస్‌మీట్‌లో పీపీటీలో చూపారు)

అంటే ఈవెంట్స్‌ ఎక్కడెక్కడ జరిగాయో కనుక్కొని, ఆ మేరకు దొంగ సర్టిఫికెట్స్‌ పుట్టించారు. మళ్లీ ఇచ్చిన ఆ ఉద్యోగాలన్నీ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ అయిన తర్వాతే, అది కూడా ఒకసారి కాదు.. ఏడుసార్లు వెరిఫికేషన్‌ తర్వాతే ఇచ్చామని, ఐఏఎస్‌ ఆఫీసర్లతో చెప్పించారు.

(అంటూ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ అన్సారియా తన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన వీడియో పీపీటీలో చూపారు)

మరో కేస్‌ స్టడీ:

బసవేశ్వరరావు స్పోర్ట్స్‌ కోటాలో జాబ్‌ పొందిన అభ్యర్థి. గుడివాడలో జరిగిన 49వ సీనియర్‌ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు ఆయన సర్టిఫికెట్‌ దాఖలు చేస్తే, అది ఫేక్‌ది అని ఆంధ్ర ఖోఖో అసోసియేషన్, శాప్‌ అధికారులకు లేఖ ఇస్తే, దాన్ని పక్కన పడేశారు. చక్కగా ఉద్యోగం ఇచ్చారు.

ఎందుకంటే, పై నుంచి ఫోన్‌. డీల్‌ కుదిరింది. కాబట్టి ఉద్యోగం ఇచ్చారు.

మరి ఏడుసార్లు ఏం వెరిఫికేషన్‌ చేశారు!.

మరో కేస్‌ స్టడీ:

ప్రగడ కళ్యాణి. కబడ్డీలో ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌. 2003లో నాగార్జున యూనివర్సిటీలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారు. దాని ఆధారంగా ఏ పరీక్ష లేకుండానే ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే.. అసలు ఆ గేమ్స్‌ నాగార్జున వర్సిటీలో జరగలేదని, అక్కడ జరిగింది కేవలం సౌత్‌–వెస్ట్‌ జోన్‌ కబడ్డీ గేమ్స్‌ మాత్రమే అని ట్విస్ట్‌ బయట పడింది. కానీ, సెవెన్‌ స్టేజ్‌ వెరిఫికేషన్‌ చేసి, ఏ పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం పొందారు. ఏడుసార్లు వెరిఫికేషన్‌ అంటే, ఎంత పకడ్బందీగా చేశారో చూడండి.

మరి కొన్ని కేసులు అయితే..:

– అభ్యర్థులు టెట్‌ పాస్‌ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చారు. చివరకు టెట్‌ కూడా లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారు.
– ఒక కేటగిరీలో టెట్‌ మార్కులు చూపించి, మరో కేటగిరీకి సంబంధించిన టీచర్‌ పోస్టు ఇచ్చారు.
– ఇంకో కేసులో అభ్యర్థి ఒక కులానికి సంబంధించిన రిజర్వేషన్‌లో ఉంటే, మరో కులం కేటగిరీలో ఇచ్చారు.
– ఇవన్నీ ఏడుసార్లు వెరిఫికేషన్‌ తర్వాత ఇచ్చిన పోస్టులు!

ఈడిగ ప్రభాకర్‌ కేసు:

కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్‌ అనే అభ్యర్థికి ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగం ఇచ్చారు. తన రిజర్వేషన్‌ కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాలి. కానీ, తనకు వచ్చింది కేవలం 65 మార్కులు మాత్రమే. అతడికి 75 మార్కులు వస్తేనే టెట్‌లో.. ఉద్యోగం ఇవ్వాలి. కానీ, తనకు 65 మార్కులే వచ్చినా పోస్ట్‌ ఇచ్చారు. అది కూడా ఏడుసార్లు వెరిఫికేషన్‌ అయిన తర్వాత సుమా...!

ఇదే విషయాన్ని కర్నూలు డీఈఓ కూడా ఒప్పుకున్నారు. అతడికి 65 మార్కులే వచ్చాయని చెప్పారు. మరి అతడికి ఉద్యోగం ఎలా ఇచ్చారు?

(అంటూ కర్నూలు డీఈఓ మీడియాతో మాట్లాడిన వీడియో బైట్‌ ప్రెస్‌మీట్‌లో పీపీటీలో చూపారు)

ఈ కేసులో తప్పును కవరప్‌ చేయడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు.

(అంటూ పాఠశాల విద్యా కమిషనర్‌ అన్సారియా ప్రెస్‌మీట్‌ వీడియో ప్రదర్శించి చూపారు).

నిజానికి ప్రభాకర్‌కు టెట్‌లో వచ్చిన మార్కులు వేరే కేటగిరీకి సంబంధించినవి. కానీ, ఆయనకు ఉద్యోగం ఇచ్చింది మరో కేటగిరీలో.

కడప జిల్లాలో రసూల్‌ అనే వ్యక్తి. బీసీ–ఈ కేటగిరీ. అతడు గతంలో 2008, 2012, 2018లో డీఎస్సీకి దరఖాస్తు చేసినప్పుడు అదే కేటగిరీలో అప్లై చేశాడు. ఇప్పుడు అతడికి ఓసీ ఈడబ్ల్యూఎస్‌ కింద పోస్టింగ్‌ ఇచ్చారు.

ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే.. వీరందరినీ 1:1 (వన్‌ ఈజ్‌ టు వన్‌) నిష్పత్తిలో సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌కు పిల్చారు. ఒకసారి కాదు. రెండుసార్లు కాదు. ఏకంగా ఏడుసార్లు సర్టిఫికెట్స్‌ వెరిఫై చేశామన్నారు. అయినా ఇన్ని అక్రమలు ఎలా జరిగాయి? ఎవరు చెబితే ఆ ఉద్యోగాలు ఇచ్చారు.

ఐఏఎస్‌ అధికారుల ప్రెస్‌మీట్‌ తర్వాత తేలింది ఏమిటి?:

తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబునాయుడుగారు ఐఏఎస్‌ అధికారులతో మాట్లాడించారు. ఆ మాటలు గనక ఒకసారి చూస్తే అంతిమంగా తేలింది ఏమిటంటే..

– టెట్‌ పాస్‌ అర్హత లేకపోయినా పోస్టులు ఇచ్చామని ఒప్పుకోక తప్పలేదు.
– స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు నిఖార్సైనవి అని చెప్పలేకపోయారు.
– వెరిఫికేషన్‌ ఒక బోగస్‌ అని చెప్పకనే చెప్పారు.
– టోర్నమెంట్లు జరగకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.
– టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు.
– లోకేష్‌ తోడల్లుడు అధ్యక్షత వహించిన జూడో అసోసియేషన్‌ లో పోటీలు జరగకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.
– కులాలు మార్చి కూడా పోస్టులు ఇచ్చామని కూడా అంగీకరించక తప్పలేదు.

అందుకే కాక్రోచ్‌లు వస్తున్నాయి:

ఇవన్నీ కూడా డీఎస్సీ స్కామ్‌పై మొదటి ప్రెస్‌మీట్‌ డీఎస్సీ–1లో నేను చెప్పిన ఆ స్కామ్‌ పునాదులు. ఆ పునాదుల నుంచి ఈ కేసు స్టడీస్‌ అన్నీ బయటకు వస్తున్నాయి.

అసలు ఏ ఎగ్జామ్‌ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే ఒక పెద్ద స్కామ్‌. అందులోనూ టీచర్‌ ఉద్యోగాలు. ఆ జీవోలు ఇవ్వడం. స్పోర్ట్స్‌ కోటాలో 372 పోస్టులు నింపడం. ఆ తర్వాత ఆ జీవోలను రద్దు చేయడం. ఇదంతా ఒక పెద్ద స్కామ్‌. పై నుంచి స్కెచ్‌ చేస్తే కింది దాకా కనిపిస్తుందా కంపు.

మరి అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు చంద్రబాబునాయుడుగారు ప్రభుత్వమే అధికారంలో ఉండగా ఆయన కింద పని చేసే అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా స్వతంత్రంగా జరుగుతాయా? ప్రతి ఒక్కరూ దీని గురించి సీరియస్‌గా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించాలి. చివరకు వెన్నుపోటు పార్టీ వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యవస్థను చెడగొడుతున్నారు. కాక్రోచ్‌లు వస్తాయని అంటే ఊరికే రావు. వ్యవస్థలను దగ్గరుండి పాలకులు చెడగొడితేనే కాక్రోచ్‌లు వస్తాయి. నాలాంటి వాడు కూడా కాక్రోచ్‌ అవుతున్నాడు.

అందుకే మా పోరాటం:

చంద్రబాబునాయుడుగారి కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలుగుతారా? అందరూ ఆలోచన చేయండి. అందుకే నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా స్కాములను ఎత్తి చూపుతూ కోర్టులో సైతం పోరాడుతున్నాం. నిరుద్యోగ యువత కోసం, ఈ వ్యవస్థను మార్చడం కోసం, ఈ వ్యవస్థలో నిజాయితీని తీసుకు రావడం కోసం ఆరాటపడుతున్నాం.

అటవీ శాఖలోనూ స్కామ్‌కు కుట్ర:

ఇంకా నిర్ఘాంతపర్చే మరో విషయం కూడా బయటపడింది. ఏ పరీక్షలు లేకుండానే టీచర్‌ పోస్టులు కట్టబెట్టిన వీరు, ఎపీపీఎస్సీలో కూడా పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు.

గత మా ప్రభుత్వ హయాంలో ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ పొందిన అటవీ శాఖ ఉద్యోగాలు 814లో స్పోర్ట్స్‌ కోటాలో 40 పోస్టులను, డీఎస్సీ మాదిరిగా పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు, డీఎస్సీ కోసం జారీ చేసిన జీఓ నెం:4 వాడుకున్నారు. అయితే డీఎస్సీ స్కామ్‌ బయట పడడంతో, ఈ 40 పోస్టుల భర్తీ ఆపేయడమే కాకుండా, మిగిలిన పోస్టుల భర్తీ కూడా ఆపేశారు.

(అంటూ ఆ నోటిఫికేషన్‌. జీఓ వివరాలను ప్రెస్‌మీట్‌లో పీపీటీలో చూపారు)

ఇది వాస్తవం కాదా?:

అటవీ శాఖలో ఉద్యోగాలను కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తూ డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా మాదిరిగా ఏ పరీక్ష లేకుండానే 40 ఉద్యోగాలు ఇయర్‌ మార్క్‌ చేసి, కేవలం ఇలాంటి సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. డీఎస్సీలో అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేయడంతో పాటు ఈ 40 పోస్టుల జాబితా బయటపెడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టులను కూడా భర్తీ నిలిపివేయడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను.

ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం ఎలా ఏర్పడుతుంది?
అందుకే సీబీఐ విచారణ జరగాలి:

అసలు ఏ స్థాయిలో స్కామ్స్‌ జరుగుతున్నాయనేది ఒకసారి గమనించమని కోరుతున్నా. పోటీ పరీక్షల లక్షల మంది పిల్లలు ప్రిపేర్‌ అవుతారు. డీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కానీ ఏదైనా సరే లక్షల మంది పిల్లలు ప్రిపేర్‌ అవుతారు. సంవత్సరాల తరబడి కష్టపడతారు. కోచింగ్‌ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటారు. అది వాళ్ళ కుటుంబాల మీద పడే బర్డెన్‌. అంత కష్టపడితే చివరికి ఏం కనిపిస్తోంది?.

స్కామ్‌లతో ఇష్టారాజ్యంగా వీళ్లకు నచ్చిన వాళ్లకు పోస్టులు లంచాలు తీసుకొని ఇస్తున్నారు. అలా స్కామ్‌లు చేస్తున్నారు. నేను అడుగుతున్నా. పరిస్థితి ఇలా ఉంటే, ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుందని? ఎలా వస్తుంది అని? అందుకే దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి.

అది జరగాలి అని అంటే ఎలా జరుగుతుంది? డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలి. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. అప్పుడే అది సాధ్యం. వ్యవస్థను గట్టిగా మేము కాపాడడానికే ఉన్నాము అన్న మెసేజ్‌ పంపించలేకపోతే ఎలా జరుగుతుంది? లేదంటే ఏమవుతాయి? కాక్రోచ్‌లు రాక తప్పవు. వీళ్ళ మెడలు వంచక తప్పదు. కచ్చితంగా అదే జరుగుతుంది.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..

మేము ఆధారాలు చూపాం కాబట్టే..:

నేను మాట్లాడిన ప్రతి ఒక్క విషయానికి పక్కా ఆధారాలు చూపాను. నా ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలి. కానీ ఇక్కడ కూడా అబద్ధాలు చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు బొంకుతున్నారు. అధికారులతో మాట్లాడించి కూడా అబధ్ధాలు చెప్పిస్తున్నారు. మేము పక్కా ఆధారాలు చూపుతున్నాం కాబట్టి, అధికారులు పరోక్షంగా ఒప్పుకోక తప్పడం లేదు. డీఎస్సీ స్కామ్‌ బయటపడకపోయి ఉంటే, అటవీ శాఖలో కూడా 40 ఉద్యోగాలు అక్రమ భర్తీ లేకుండా ఆగిపోయింది.

లక్షల మంది ప్రిపేర్‌ అవుతారు. లక్షలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకుంటారు. వారికి అన్యాయం చేయడం కాదా? ఏ మెసేజ్‌ పంపిస్తున్నారు? రేపు మన దగ్గర ఎవరైనా జెనూయిన్‌గా పరీక్ష రాస్తారా?

పాలకులు ఇలా అక్రమాలు చేస్తే ఎలా?

మా హయాంలో పూర్తి పారదర్శకంగా..:

మా ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడా ఆరోపణలు రాలేదు. వివాదాలు తలెత్తలేదు. ఎక్కడా అక్రమాలు జరగలేదు. అదే సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది వెన్నుపోటు పార్టీకి సంబంధించిన పిల్లలు ఉద్యోగాలు చేస్తా ఉన్నారో మీకే కనిపిస్తుంది. కావాలంటే చూడండి.

ప్రభుత్వం అనేది ఒక విశ్వాసాన్ని పెంపొందించేలా ఉండాలి. లేకపోతే వ్యవస్థ కూలిపోతుంది. అందుకే మా పోరాటం కొనసాగుతుంది.

కాగా, ఢిల్లీ స్థాయిలో కూడా నిరసన, ధర్నా చేస్తారా? అంటే తమ పోరాటం నిరంతరం వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై కొనసాగుతుందని శ్రీ వైయ‌స్‌ జగన్‌ వెల్లడించారు. ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి. కానీ మాట్లాడడం లేదు. చివరకు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు కూడా అసలు మాట్లాడడం లేదు. కాబట్టి వారు సిగ్గుతో తల దించుకోవాలి.

క్లీన్‌చిట్‌ అని చెప్పడం దౌర్భాగ్యం:

చంద్రబాబు తన మీద కేసులు తాను కొట్టేయించుకుంటున్నాడు. ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి. ఇప్పుడు కూడా డీఎస్సీ కేస్‌ నిర్వీర్యం చేసే పని చేస్తున్నాడు. అయినా స్కిల్‌ కేసులో తనకు క్లీన్‌చిట్‌ వచ్చిందని చంద్రబాబు చెప్పుకోవడం దౌర్భాగ్యం అని శ్రీ వైయ‌స్‌ జగన్‌ ఆక్షేపించారు. 
 

Back to Top