గుంటూరు: డీఎస్సీ కుంభకోణంలో లోకేష్ అడ్డంగా దొరికిపోయారని, ఆయనకు మంత్రిగా కొనసాగే హక్కు లేదని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు మండిపడ్డారు. డీఎస్సీ పరీక్షల్లో ఎన్నడూ జరగనంత అవినీతి జరిగిందని, డీఎస్సీ, ఏపీపీఎస్సీ వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబు, లోకేష్ స్పందించకుండా మౌనం వహిస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఉద్యోగాలను బఠానీలు అమ్మినట్లు అమ్మేశారని, లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్ అధికారులతో మాట్లాడిస్తూ అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. డబుల్ ఓట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలి: గుంటూరు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని డబుల్ ఓట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ నేతలు వినతిపత్రాలు సమర్పించారు. అంబటి రాంబాబు, విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరీ ఫాతిమా సంయుక్తంగా మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు.