అధైర్యపడొద్దు.. మీకు అండగా నేనున్నాను

 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయకేతనం ఎగురవేయాలి

మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

నంద్యాల జిల్లా: పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి అధైర్యానికి గురికావాల్సిన అవసరం లేదని, “అధైర్యపడొద్దు.. మీకు అండగా నేనున్నాను” అని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి భరోసా కల్పించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయకేతనం ఎగురవేసేలా ప్రతి గ్రామం, ప్రతి మండలంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.  ఆత్మకూరు పట్టణంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి అధైర్యానికి గురికావాల్సిన అవసరం లేదని, “అధైర్యపడొద్దు.. మీకు అండగా నేనున్నాను” అని భరోసా కల్పించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి మండలంలో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయకేతనం ఎగురవేయాలని, నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని పార్టీ సత్తా చాటాలని అన్నారు. అందరూ సమన్వయంతో కష్టపడి పనిచేస్తే విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రస్తావిస్తూ, ఎన్నికల సమయంలో హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేశారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 870 అడుగుల స్థాయిలో ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని, నీటి లభ్యత ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందకపోవడం బాధాకరమని అన్నారు.

కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు తాగునీటి కోసం కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాటాలు చేస్తోందని, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, ప్రజల పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం తాగునీటిని విడుదల చేసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ తరఫున భవిష్యత్తులోనూ నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ నాయకులకు ఐడీ కార్డులను శిల్పా చక్రపాణి రెడ్డి పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ శ్రీశైలం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Back to Top