ఎస్‌ఐఆర్‌లో మార్పుల పూర్తి వివరాలను బూత్‌ల వారీగా వెల్లడించాలి

సీఈఓకు వైయ‌స్ఆర్‌సీపీ కీలక లేఖ

కొత్తగా చేర్చిన, తొలగించిన, బదిలీ చేసిన ఓటర్ల వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి

తాడేపల్లి: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో జరిగిన మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను బూత్‌, నియోజకవర్గాల వారీగా సమగ్ర అధికారిక ప్రకటన రూపంలో వెల్లడించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కీలక లేఖ రాశారు. కొత్తగా చేర్చిన, తొలగించిన, బదిలీ చేసిన, మరణించిన ఓటర్ల వివరాలను కేవలం డౌన్‌లోడ్‌ లింకుల రూపంలో కాకుండా అధికారికంగా అందుబాటులో ఉంచాలని కోరింది. ఎన్ని నోటీసులు జారీ చేశారు, ఎన్ని పరిష్కరించారు, ఎన్ని ఓట్లు తొలగించారు అనే పూర్తి లెక్కలను వెల్లడించాలని విజ్ఞప్తి చేసింది. వైయ‌స్ఆర్‌సీపీ ఇప్పటికే అందించిన అనుమానిత నకిలీ ఓటర్ల వివరాలపై చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్న నకిలీ ఓటర్ల నమోదులను పరిశీలించి ఒక వ్యక్తికి ఒకే చెల్లుబాటు అయ్యే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించకుండా, ఒకే ఇంటి చిరునామాలో ఉన్న కుటుంబ సభ్యులను సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉంచాలని వైయ‌స్ఆర్‌సీపీ కోరింది. ఎస్‌ఐఆర్‌ తర్వాతి తాజా ఓటర్ల వివరాల ఆధారంగా పోలింగ్‌ కేంద్రాల పునర్విభజనను సమీక్షించాలని, ఓటర్లను ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో పోలింగ్‌ కేంద్రానికి ఏ ప్రాతిపదికన మార్చారో స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇంటి నంబర్‌, భౌగోళిక ప్రాంతం, వరుస సంఖ్య తదితర ప్రమాణాలను వెల్లడించి ఓటర్ల జాబితాలను వీలైనంత వరకు ఇంటి నంబర్‌, ప్రాంతం వారీగా క్రమబద్ధీకరించాలని కోరింది. కొత్తగా ఏర్పాటు చేసిన, పునర్విభజించిన పోలింగ్‌ కేంద్రాల పూర్తి వివరాలతో పాటు వాటికి నియమించిన బూత్‌ స్థాయి అధికారుల పేర్లు, సంప్రదింపు వివరాలను బహిరంగపరచాలని, బూత్‌ మ్యాపింగ్‌, ఓటర్ల బదిలీలు, బూత్‌ స్థాయి అధికారుల వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలని విజ్ఞప్తి చేసింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బూత్‌ స్థాయిలో పూర్తి పారదర్శకంగా, ధృవీకరించుకునే విధంగా నిర్వహించాలని, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరును కూడా తొలగించకూడదని వైయ‌స్ఆర్‌సీపీ స్పష్టం చేసింది.

Back to Top