మచిలీపట్నం: డీఎస్సీ అక్రమాలు, తప్పుడు నిర్ణయాల పాపాలను ఐఏఎస్ అధికారుల మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికారులు చంద్రబాబు తప్పుడు ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, డీఎస్సీ అంశం, కలెక్టర్ల సమావేశంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేసే తప్పులను, అవినీతిని, పాపాలను ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీదకు నెట్టేసే ప్రయత్నం సీఎం చంద్రబాబు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి నాళ్లలోనే కలెక్టర్లతో సమావేశం పెట్టి 'పొలిటికల్ గవర్నెన్స్' చేయాలని ఆదేశించారన్నారు. తనే స్వయంగా తప్పుడు జీవోలు ఇస్తూ, రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తుంటే ఇవాళ అధికారులను నిలదీయడం దారుణమన్నారు. "తమ కొడుకు మంచోడంట, ఉద్యోగాలు అమ్ముకున్న వాళ్లు మంచోళ్లంట, కానీ ఐఏఎస్ అధికారులే చెడ్డోళ్లంట. మిమ్మల్ని నమ్మి పెత్తనం అప్పగిస్తే తలంతా గొరిగారంటూ ఐఏఎస్‌లను తిడుతున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో జరిగే తప్పుల నిందను అధికారులపై మోపుతున్నారని, కాబట్టి జిల్లా స్థాయి అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు చంద్రబాబు తప్పుడు ఆలోచనలకు బలి కావొద్దని, ఆయన చెప్పే అక్రమ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్‌సీపీ సమాయత్తం: వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకే ఈ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినట్లు పేర్ని నాని తెలిపారు. రెండేళ్లపాటు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వని దుర్మార్గపు ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ప్రజలపై కపట ప్రేమ చూపుతోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఒకటో తేదీనే పెన్షన్లు పంచుతామని, ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్లు, నామినేషన్లు అంటూ హడావుడి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మోసాలను, వెన్నుపోట్లను ప్రజలకు వివరించి, ప్రతి మున్సిపాలిటీలోనూ వైయస్ఆర్‌సీపీ గెలుపే లక్ష్యంగా "విజయమో వీరమరణమో" అన్న విధంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. జిల్లా నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో ఉన్నారని, ప్రతి మున్సిపాలిటీని గెలిపించి వైయస్ జగన్‌కు కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు.