ఏపీ కరువును ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలి

కూటమి సర్కార్ వైఫల్యాలపై అన్ని పక్షాల ఐక్య పోరాటం  

పిలుపునిచ్చిన సీపీఐ నేతలు

కరువు సమస్యలపై సమరశంఖం

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్ జగన్‌తో సీపీఐ ప్రతినిధి బృందం భేటీ  

ఈ నెల 26న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం

తాడేపల్లి: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృందం ఆహ్వానించింది. గురువారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి తదితరులు వైయ‌స్ జగన్‌తో సమావేశమయ్యారు.

ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య.. రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఓటర్ల జాబితా సవరణ (SIR), ప్రజా సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీతో కలిసి ఉమ్మడి పోరాటాలు సాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందుకు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సానుకూలత, సంసిద్ధత వ్యక్తం చేశారని ఈశ్వరయ్య వెల్లడించారు.

26న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం

సెప్టెంబర్ 26న రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సీపీఐ నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలను ఏకం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ను కలిసి సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయడానికి వైయ‌స్ జగన్ సుముఖత వ్యక్తం చేశారని ఈశ్వరయ్య తెలిపారు.

రాష్ట్ర కరువును ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలి

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ తీవ్ర సంక్షోభంలో పడిందని సీపీఐ నేతలు తెలిపారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంగా 514 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 218 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని పేర్కొన్నారు. 80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదన్నారు. తమ క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో కనీసం విత్తనం కూడా వేయలేని పరిస్థితి ఉందని తెలిపారు.

ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల భూగర్భ జలాలు కొంత పెరిగినా, ఎండిపోయిన పంటలు తిరిగి బతికే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కరువును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్ని పక్షాలు ఏకమైతేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి అన్నదాతలను ఆదుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు.

ఎస్ఐఆర్ (SIR) పేరిట ఓట్ల తొలగింపు దుర్మార్గం

రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ నేతలు పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పేద ప్రజల ఓట్లను నిబంధనల పేరుతో తొలగించడం సరికాదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అవసరమైతే ఆన్‌లైన్ ద్వారా కూడా వారి పేర్లను నమోదు చేసే అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాలకు సిద్ధం

కరువు, అక్రమాలు, కార్పొరేట్ శక్తులకు ప్రజా భూముల ధారాదత్తం, పర్యావరణానికి విఘాతం కలిగించే వివాదాస్పద ప్రాజెక్టులు, డేటా సెంటర్ల సమస్యలపై సీపీఐ పోరాటాలు కొనసాగిస్తుందని ఈశ్వరయ్య తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ వంటి ప్రధాన ప్రతిపక్షంతో కలిసి ప్రజా సమస్యలపై సంయుక్తంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ ప్రతిపాదనలపై వైయ‌స్ జగన్ సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని సీపీఐ నేతలు కోరారు. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులను కఠినంగా శిక్షించాలని, తప్పు జరగలేదని ప్రభుత్వం భావిస్తే ఆధారాలతో సహా వాస్తవాలను ప్రజల ముందుంచాలని తెలిపారు. ప్రతిపక్షాలు సీబీఐ విచారణ కోరుతున్న నేపథ్యంలో రాత్రికి రాత్రే జీవోలు ఎందుకు మార్చారన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

డీఎస్సీ అంశంపై ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, నాయకులు, నిరుద్యోగులపై లాఠీచార్జీలు, భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆందోళనకారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం, రౌడీషీట్లు తెరవడం ద్వారా భయభ్రాంతులకు గురిచేసే వైఖరిని కూటమి ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని స్పష్టం చేశారు. 

Back to Top