అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొత్తఊరు బ్రిడ్జి కోతకు గురైంది. పరిస్థితిని తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు హుటాహుటిన బ్రిడ్జి వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వంతెన ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తుపాన్ తీవ్రత తగ్గే వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లోనూ వాగులు పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం ఇరడపల్లి పంచాయతీ పరిధిలో తుపాన్ కారణంగా ఇళ్లు కూలిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమర్బ మాలం నాయుడు, తమర్బ చినలమ్మ కుటుంబాలను ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీధరి రాంబాబు, వైయస్ఆర్‌సీపీ మండల యువజన అధ్యక్షుడు గల్లెలి లింగమూర్తి, సీనియర్ నాయకులు ముదిలి సత్యనారాయణ, తమర్బ బాబులు నాయుడు, తమర్బ వెంకటేశ్వర్లు నాయుడు, ముదిలి త్రినాథ్, కిల్లో శ్రీను, మంత్రి రామలింగం తదితరులు పాల్గొన్నారు.