తాడేపల్లి : వైయస్ఆర్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని వైయస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాజశేఖర్‌తో తమకున్న అనుబంధాన్ని, పార్టీ కోసం ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఇటీవల డీఎస్సీ నియామకాలపై జరిగిన ఆందోళనల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న నాయకుడిని కోల్పోవడం పార్టీకి, వ్యక్తిగతంగా తమకు తీరని లోటని భావోద్వేగం వ్యక్తం చేశారు. రాజశేఖర్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేశారని నేతలు తెలిపారు. వైయస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ మరణవార్త తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు నేతలు తెలిపారు. త్వరలోనే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు వెల్లడించారు. రాజశేఖర్ కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నాయకులు ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి ఒంగోలుకు తరలించనున్నట్లు నాయకులు తెలిపారు.