శింగనమల: బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి సమీపంలోని ఎర్రితాత ఫంక్షన్ హాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైయస్ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని, అయితే పార్టీ లక్ష్యం కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాదని చెప్పారు. ప్రజల మధ్య ఉండటం, వారి సమస్యలపై పోరాడటం, కష్టాల్లో ప్రజలకు అండగా నిలబడటమే వైయస్ఆర్‌సీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సంక్షేమం, రైతులకు భరోసా, విద్యార్థులకు ప్రోత్సాహం, మహిళలకు అండ, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హామీలు, పాలన తీరుపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బుక్కరాయసముద్రం మండలంలో రైతులు నీరు, సాగునీరు, పంటలకు గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాలు, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని శైలజానాథ్ తెలిపారు. రైతు బాగుంటేనే గ్రామం, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు సమస్యలపై రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వెళ్లే నాయకత్వం కాకుండా, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచే నాయకత్వమే అవసరమని చెప్పారు. కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, అధికారం, పదవులు శాశ్వతం కావని, ప్రజల విశ్వాసమే శాశ్వతమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు తీరును ప్రజల ముందుంచాలని సూచించారు. అనంతరం మండల స్థాయి నాయకులకు పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.