తాడేపల్లి : ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమై, ఎప్పటిలాగే ప్రచారాన్నే నమ్ముకుని పాలన సాగిస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర విమర్శించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అనుకూల మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదన్న కారణంతో ఇప్పుడు కొత్త సోషల్ మీడియా పాలసీని తెచ్చారని ఆరోపించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఒక్కో పోస్టుకు వేల రూపాయలు చెల్లిస్తూ వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం దోపిడీకి మరో రూపమని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేకపోయినా, పెయిడ్ ఇన్ఫ్లూయెన్సర్లతో ప్రచారం చేయించేందుకు ప్రజాధనాన్ని వినియోగించడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఐటీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానాను అప్పగించే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పాలసీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్ల కూటమి పాలన అట్టర్ ఫ్లాప్.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల నుంచి మొదలుపెడితే చివరికి రాష్ట్రంలో శాంతిభద్రతల వరకు కూటమి ప్రభుత్వ పనితీరు పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. డిజాస్టర్ అయిన భారీ బడ్జెట్ సినిమాను సేవ్ చేసుకోవడానికి మేకర్స్ ముందుగానే భారీగా పబ్లిసిటీ చేసుకుంటూ డబ్బా కొట్టుకున్నట్లే.. చంద్రబాబు కూడా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. తండ్రీకొడుకుల స్వీయ డబ్బా.. పరస్పర పొగడ్తలు.. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో చంద్రబాబు చెప్పే అబద్ధాలను ఎవరూ వినడం లేదు. దీంతో తండ్రిని కొడుకు, కొడుకుని తండ్రి పొగుడుకుంటూ పరస్పర డబ్బా కార్యక్రమానికి తెరలేపారు. 'మా నాన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ' అని లోకేష్ చెబితే, 'మా కొడుకు సూపర్' అని చంద్రబాబు కితాబులిచ్చుకుంటున్నారు. వాళ్లకు వత్తాసు పలికే పచ్చ పత్రికలు, అనుకూల ఛానళ్లు, ఫేక్ న్యూస్ వెబ్‌సైట్లలో ఎంత భీభత్సంగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఐటీడీపీ కార్యకర్తలకు ప్రజల సొమ్ము దోచిపెట్టేందుకే కొత్త పాలసీ. ప్రజలు తమ ప్రచారాన్ని పట్టించుకోకపోవడంతో చంద్రబాబు కొత్త ప్లాన్ వేశారు. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేసే ఇన్ఫ్లూయన్సర్ల పేరుతో ఐటీడీపీ కార్యకర్తలకు కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి ఒక్కో పోస్టుకు అక్షరాలా రూ.15,000 చొప్పున చెల్లిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి రోజుకో పోస్టు పెడితే నెలకు రూ.4.5 లక్షల ప్రజల సొమ్మును ధారపోస్తున్నారు. సొంత డబ్బా కొట్టుకోవడానికి హెరిటేజ్ సంస్థ డబ్బులు వాడకుండా, ప్రజలు కష్టపడి కట్టిన పన్నుల సొమ్మును ఇంత నిర్లజ్జగా దుర్వినియోగం చేస్తారా?. పథకాలకు పైసల్లేవు.. ప్రచారానికి వందల కోట్లా?. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి నిధులు లేవంటారు. తుఫాను తాకిడికి తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవడానికి ఖజానా ఖాళీ అంటారు. కానీ చంద్రబాబు తన సొంత భజన కోసం, డబ్బా ప్రచారం కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేటాయించడం తీవ్రమైన అన్యాయం. అమరావతి మునకపై పచ్చి అబద్ధాల ప్రచారం.. మొన్నటి వర్షాలకు కొండవీటి వాగు పొంగి అమరావతి మొత్తం మునిగిపోయింది. గతంలోనే ముంపు ప్రమాదం ఉందని చెప్పాం. ఇప్పుడు అదే నిజమైందని ప్రజలు కళ్లారా చూశారు. కానీ చంద్రబాబు వెంటనే తన అనుకూల మీడియాను, ఈ పెయిడ్ ఇన్ఫ్లూయన్సర్లను రంగంలోకి దించి.. అక్కడ మునకే లేదని, భారీగా భవనాలు, టవర్లు కట్టేస్తున్నామని పచ్చి అబద్ధాలను ప్రచారం చేయించారు. డబ్బులు తీసుకుని మాట్లాడే ఈ ఇన్ఫ్లూయన్సర్లు ఎప్పుడైనా ప్రభుత్వ లోపాలను, వాస్తవాలను బయటపెడతారా?. అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి.. దోపిడీకి అక్షయపాత్ర. అమరావతిలో రాజధాని పేరుతో 50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. అందులో కట్టింది కేవలం 434 అపార్ట్‌మెంట్లు, 200 విల్లాలు మాత్రమే. హైకోర్టు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఐదు సచివాలయ టవర్లు కలిపినా మొత్తం నిర్మాణాలకు అవసరమైనది కేవలం 1200 ఎకరాలు మాత్రమే. మరి మిగిలిన 48 వేల ఎకరాల పరిస్థితి ఏమిటి? హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో అన్ని సదుపాయాలతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.3,000 నుంచి రూ.4,000 ఉంటే, అమరావతిలో ఏకంగా రూ.20,000 కోట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఎకరానికి రూ.2 కోట్లు కేటాయించారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్లు కొట్టేయడానికే చంద్రబాబుకు అమరావతి అక్షయపాత్రలా మారింది. వైయస్ఆర్‌సీపీ గొంతు నొక్కేందుకు అక్రమ కుట్రలు.. కూటమి ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, అధికార ప్రతినిధులు, చివరికి సాక్షి మీడియాకు సంబంధించిన దాదాపు రెండు లక్షల సోషల్ మీడియా ఖాతాలను గత ఐదు నెలల్లో తప్పుడు రిపోర్టులతో అక్రమంగా బ్లాక్ చేయించారు. రోజుకు సగటున దాదాపు 1,300 అకౌంట్లను తొలగించేలా ఈ పెయిడ్ ముఠాలతో కుట్రలు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను ఇంత దారుణంగా అణచివేయడం చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనం. ఇన్ఫ్లూయన్సర్ల పాలసీని వెంటనే రద్దు చేయాలి.. ఈ నేపధ్యంలో ప్రజాధనాన్ని అడ్డగోలుగా లూటీ చేస్తూ, సొంత భజన చేయించుకోవడానికి తీసుకొచ్చిన ఈ ఇన్ఫ్లూయన్సర్ల పాలసీని నరేంద్ర తీవ్రంగా తప్పుపట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజాధనంతో స్వీయ ప్రచారం చేసుకునే ఈ దుర్మార్గమైన విధానాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ప్రచారం కావాలనుకుంటే తన సొంత సంస్థ హెరిటేజ్ సొమ్ముతో చేయించుకోవాలి తప్ప ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.