శ్రీకాకుళం: 2021–2026 కాలంలో పదవీకాలాన్ని పూర్తి చేసిన ఎంపీపీలు, జెడ్పీటీసీలను శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శ్రీకాకుళం పట్టణంలోని ఎల్.ఎన్. గ్రీన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అభినందన సభకు మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజా సేవలో అంకితభావంతో పనిచేస్తేనే నిజమైన సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురైనా ప్రజల పట్ల బాధ్యతతో పదవులను నిర్వర్తించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలను అభినందించారు. ప్రజా సేవలో వారు సంపాదించిన అనుభవం, ప్రదర్శించిన అంకితభావం భవిష్యత్తులో మరింతగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం పదవీకాలం పూర్తి చేసిన మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీరియా విజయలక్ష్మి, ఎమ్మెల్సీ నర్తు రామారావు, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఇచ్చాపురం సమన్వయకర్త సాడే శ్యాంప్రసాద్, యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.