మచిలీపట్నం: అధికారం పోగానే కొందరు తెల్లారికే కండువాలు మార్చుకుని దర్జాగా తిరుగుతున్నారని, అయితే వైయస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం పార్టీకి అండగా నిలిచారని ఆ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ పేర్ని కిట్టు అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటిపై టీడీపీ జెండా ఉన్నప్పటికీ అర్హత ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కూటమి ప్రభుత్వం ఒక్క హామీనైనా పూర్తిగా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. కొల్లు రవీంద్రకు ఇదే తన ఛాలెంజ్ అని పేర్ని కిట్టు పేర్కొన్నారు. గతంలో టీడీపీ తరఫున మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు అబద్ధమైతే బందరుకోటలో నిర్మించిన గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని చెప్పారు. తనతో పోల్చుకోవద్దని కొల్లు రవీంద్రకు సూచించిన కిట్టు, పార్టీలో సీట్ల వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం పోర్టు పేరుతో 33 వేల ఎకరాలు తీసుకోవాలని గతంలో ప్రయత్నించారని, వైఎస్ జగన్ హయాంలో కేవలం 1,700 ఎకరాల ప్రభుత్వ భూమిలో పోర్టు నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.