రాష్ట్రంలో జరగని అభివృద్ధిని జరిగినట్లుగా చూపించేందుకే డిజిటల్‌ పాలిటిక్స్‌

వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ బాబా సలామ్‌

 అనంతపురం: రాష్ట్రంలో వాస్తవంగా జరగని అభివృద్ధిని జరిగినట్లుగా ప్రచారం చేసుకునేందుకే కూటమి ప్రభుత్వం డిజిటల్‌ పాలిటిక్స్‌కు తెరతీసిందని వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ బాబా సలామ్‌ విమర్శించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబాల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటని ప్రశ్నించారు.

ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలపై నిధులు ఖర్చు చేయాల్సిన ప్రభుత్వం ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తోందని బాబా సలామ్‌ పేర్కొన్నారు. జర్నలిస్టులకు భరోసా కల్పించే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని, వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఇస్తున్న ప్రాధాన్యతలో కనీసం కొంతైనా ఎన్నో ఏళ్లుగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

నిరుద్యోగ భృతికి నిధులు ఎందుకు కేటాయించడం లేదు?

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలని బాబా సలామ్‌ పేర్కొన్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్ల పాలసీ కోసం చూపుతున్న ఆసక్తిని నిరుద్యోగ భృతి అమలులో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు అండగా నిలవాలనే చిత్తశుద్ధి ఉంటే భృతి అందించడంతో పాటు కొత్త పరిశ్రమలు, కంపెనీలను తీసుకొచ్చి యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.

ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలియజేయడానికి ప్రచారం అవసరమే అయినప్పటికీ, లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపకుండా డిజిటల్‌ ప్రచారంతో వాటిని పక్కదారి పట్టించలేరని అన్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్ల పాలసీ వెనుక ప్రభుత్వ స్వప్రయోజనాలే ఉన్నాయని బాబా సలామ్‌ ఆరోపిస్తూ, ప్రచారం కంటే ప్రజల సంక్షేమం, యువతకు ఉపాధి, జర్నలిస్టుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
 

Back to Top