అనంతపురం: నగర కార్పొరేషన్‌లో డివిజన్ల విభజన, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఓటర్ల విభజనలో అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. నగరంలో 2,37,007 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఒక్కో డివిజన్‌లో 3,500 నుంచి 4,000 వరకు ఓటర్లు ఉండేలా విభజన జరగాల్సి ఉన్నప్పటికీ, కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వసీం పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా డివిజన్ హద్దులు, వీధుల విభజన, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, రిజర్వేషన్లను ప్రభావితం చేసేలా కుల గణనలో మార్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్‌నగర్‌లో ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాలను ఇతర డివిజన్లలో కలిపి రిజర్వేషన్లు మార్చే ప్రయత్నం జరుగుతోందని, కుల గణనలో ఓసీలను బీసీలుగా, బీసీలను ఓసీలుగా చూపించినట్లు ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించడం లేదని తెలిపారు. ఒక్కో డివిజన్‌కు 5,955 ఓట్లు కేటాయించడం, మరో డివిజన్‌ను 2,141 ఓట్లతో ఏర్పాటు చేయడం వంటి వ్యత్యాసాలే అధికారుల వైఖరికి నిదర్శనమన్నారు. గతంలో ప్రజలకు అనుకూలంగా ఉన్న పోలింగ్ బూత్‌లను దూర ప్రాంతాలకు మార్చడం వల్ల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్‌కు ప్రతిపక్ష పార్టీల నేతలు, స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా స్పందించడం లేదని వసీం విమర్శించారు. అధికారులు ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, మాజీ కార్పొరేటర్లు ఇషాక్, కమల్ భూషణ్, వైయస్ఆర్‌సీపీ నేతలు కుళ్లాయి స్వామి, కాకర్ల శీనా, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.