ఎన్నికలొచ్చినప్పుడల్లా వివేకా హత్య కేసు తెరపైకి తెస్తారు

అలా రాజకీయంగా లబ్ధి పొందే యత్నం చేస్తున్నారు

గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్‌

హైదరాబాద్, కొండాపూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి.

ఏ–1, ఏ–2 లకు తప్పుడు స్క్రిప్ట్‌లు ఇచ్చి బురద జల్లుతున్నారు 

జగన్, వైయ‌స్ఆర్‌సీపీ ని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ కుట్రలు

నిత్యం పేదలకు సేవ చేస్తున్న భారతి గారిపై విషం కక్కడం హేయం 

ప్రభుత్వ తీరుపై గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌:  వైయ‌స్‌ వివేకానంద రెడ్డి హత్య కేసును పదేపదే రాజకీయంగా తెరపైకి తీసుకొస్తూ, ఎన్నికల సమయంలో లబ్ధి పొందేందుకు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. వివేకా హత్య కేసు పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ సమగ్ర విచారణ పూర్తి చేసి ట్రయల్‌కు సిద్ధపడితే, పదేపదే కోర్టుల్లో స్టేలు తెచ్చి విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజకీయంగా జగన్‌ గారిని, వైయ‌స్ఆర్‌సీపీ నేతలను ఎదుర్కోలేకే ఇలాంటి నీచ రాజకీయాలకు దిగుతున్నారని, చివరకు మహిళలను కూడా వివాదాల్లోకి లాగుతూ దిగజారి ప్రవర్తిస్తున్నారని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ట్రయల్‌ జరగకుండా అడ్డుకుంటున్నది మీరు కాదా?:
    సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేసి ట్రయల్‌కు సిద్ధంగా ఉన్నప్పుడు కేసు ట్రయల్‌ ఎందుకు ముందుకు సాగడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ట్రయల్‌ జరిగితే వాస్తవాలు న్యాయస్థానం ముందు, ప్రజల ముందు వస్తాయి. వివేకా హత్య కేసులో ఏ–1, ఏ–2గా ఉన్న వ్యక్తులే హత్యలో తమ పాత్రను అంగీకరించారని చెబుతున్న పరిస్థితుల్లో, ఇప్పుడు వారితోనే కొత్త కథనాలు చెప్పించడం ఏమిటి? హత్య చేసిన వాళ్లే వాస్తవాలు బయటపెడతామని చెప్పడం, మరోవైపు కేసును ట్రయల్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం వెనుక ఉద్దేశమేంటో ప్రజలకు చెప్పాలి. వారికి రక్షణ కల్పించి, కేసులోని వాస్తవాలను త్వరగా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
    ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ కేసును రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం కాకుండా, న్యాయ ప్రక్రియ ద్వారా వాస్తవాలను తేల్చాలని కోరుతున్నాను.

జగన్‌ గారిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ కుట్రలు:
    వివేకా మరణంతో పాటు మరికొందరి మరణాలను కూడా ఈ కేసుతో ముడిపెట్టి మాట్లాడుతున్నప్పుడు, ఆయా మరణాలకు సంబంధించిన పోస్టుమార్టం నివేదికలు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. కాబట్టి వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వం నివేదికలను బయటపెట్టి ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలి. రాజకీయంగా జగన్‌ గారిని, అవినాష్‌ రెడ్డిలను ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులు చేయడం సరికాదు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత విమర్శలకు దిగడం, మహిళల గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం ఏ రాజకీయ సంస్కారమో చెప్పాలి.
    వైఎస్‌ భారతి గారి గురించి కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆమె నిత్యం పేద పిల్లలు, అనాథలు, దివ్యాంగుల కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అందరికీ తెలుసు. అలాంటి మనిషిపై నిందలు మోపడం సిగ్గుచేటు. మహిళలను గౌరవించడం రాజకీయ సంస్కారంలో భాగం. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల ఆదరణ పొందాలి. అంతే కానీ వ్యక్తిగత దాడులు, ఆరోపణలు, ఎన్నికల సమయంలో కేసులను రాజకీయంగా వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top