సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజం

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

ఉద్యోగులు హక్కులు అడిగితే ఈడ్చి పారేస్తారా?

మహిళలని కూడా చూడకుండా వ్యాన్లలో కుక్కుతారా?

ప్రభుత్వ తీరుపై జక్కంపూడి రాజా ఫైర్‌

సచివాలయ ఉద్యోగులపై ఎల్లో మీడియా దుష్ప్రచారం

వారంతా రౌడీ, పొరంబోకు, బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లా!

వారిలో మహిళలు ఉన్నారన్న విషయం కూడా మర్చారా?

ఎల్లో మీడియా తీరుపై జక్కంపూడి రాజా ఫైర్‌

రాజమహేంద్రవరం: దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కూల్చివేసేందుకు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ అయ్యారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు విజయవాడ వచ్చిన సచివాలయ ఉద్యోగులపై పోలీసులు అమానుషంగా దాడులకు తెగబడటం హేయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా జుట్లు పట్టుకుని రోడ్లపై ఈడ్చుకెళ్లి, వీధి కుక్కలను మున్సిపాలిటీ బండ్లలో కుక్కినట్లుగా పోలీసు వ్యాన్లలోకి నెట్టడం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఉన్నత చదువులు చదివి రాత్రింబవళ్లు ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులను కొన్ని మీడియా ఛానళ్లలో పోరంబోకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ అంటూ అత్యంత హేయమైన భాషతో కించపరచడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. వీధుల్లోకి వెళితే కూటమి నాయకులకు చీపురు దెబ్బలు తప్పవని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా హెచ్చరించారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంకా ఏం మాట్లాడారంటే..:

హక్కులడిగితే వీధి కుక్కల్లా ఈడ్చుకెళ్తారా?:
    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్లకు, మంత్రులకు పలుమార్లు అర్జీలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ప్రజాస్వామ్య పద్ధతిలో విజయవాడలో నిరసన తెలపడానికి వెళ్లారు. శాంతియుతంగా తమ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్లిన ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా విరుచుకుపడ్డారు. మహిళా ఉద్యోగుల జుట్లు పట్టుకుని రోడ్ల మీద లాగారు. మున్సిపాలిటీ బండ్లలో వీధి కుక్కలను ఎక్కించినట్లుగా వారిని పోలీసు వ్యాన్లలో కుక్కారు. ఒంటిపై చేతులు వేసి దాష్టీకం ప్రదర్శించారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం కాకుండా రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.

మీడియాలో పోరంబోకులు అనడం అత్యంత హేయం:
    డిగ్రీలు, పీజీలు, డబుల్‌ పీజీలు చదివి, తీవ్ర పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రజాసేవలోకి వచ్చిన ఉద్యోగులను కొన్ని మీడియా ఛానళ్లు బ్లేడ్‌ బ్యాచ్, గాంజా బ్యాచ్, పోరంబోకులు అంటూ అసభ్య పదజాలంతో దూషించడం దారుణం. జర్నలిజం ముసుగులో ఇంత నీచమైన భాష వాడతారా? కోవిడ్‌ సంక్షోభం నుంచి నేటి వరకు సచివాలయ ఉద్యోగులు చేసిన సేవలు గ్రామీణ ప్రాంతాల్లోని అభాగ్యులను అడిగితే తెలుస్తాయి. బాధ్యతాయుతమైన ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడే వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి.

జగన్‌ గారిపై కడుపుమంటతోనే వ్యవస్థల నిర్వీర్యం:
    గ్రామాల్లో సచివాలయాలు కనిపిస్తే చాలు ప్రజలకు జగన్‌గారు గుర్తుకొస్తారనే అక్కసుతోనే చంద్రబాబు ఈ వ్యవస్థను ధ్వంసం చేయాలని చూస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.10 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలోచెప్పి ఓట్లు దండుకుని, తీరా అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేశారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థపై పడ్డారు. జీవో నెం:11 తీసుకొచ్చి ఉద్యోగులపై విపరీతమైన పనిభారం మోపారు. అర్ధరాత్రుల వరకు వీడియో కాన్ఫరెన్స్‌లు పెడుతూ, సెలవుల్లోనూ వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఈ ఒత్తిడి వల్లే వందలాది ఉద్యోగులు హార్ట్‌ స్ట్రోకులు, బ్రెయిన్‌ స్ట్రోకులతో ప్రాణాలు కోల్పోయారు.

రెండున్నరేళ్లుగా కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు?:
    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థను రెండేళ్ల కోవిడ్‌ సమయంలోనూ కొనసాగించి, 2022 పీఆర్సీలో రెగ్యులరైజ్‌ చేశాం. ఉద్యోగం వచ్చిన వెంటనే ప్రమోషన్‌ ఇవ్వరు.. నిర్దిష్ట కాలపరిమితి తర్వాతే ప్రమోషన్లు వస్తాయి. మా ప్రభుత్వ హయాంలో కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా ఇచ్చాం. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పూర్తిగా స్ట్రీమ్‌లైన్‌ చేసి, ప్రమోషన్లకు ఒక స్పష్టమైన విధానం తీసుకురావాల్సింది. రెండున్నరేళ్లు గడిచినా ఏం చేశారని అడుగుతున్నాం. ప్రతి సమస్యకు మంత్రివర్గ కమిటీ వేశామని చెబుతున్నారు.. సమస్యలు పరిష్కరించడానికి కమిటీలా, కాలయాపన చేయడానికి కమిటీలా? నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం తప్ప సమస్యలకు పరిష్కారం చూపడం లేదని ప్రశ్నిస్తున్నాం.

డీఎస్సీపై సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?:
    జగన్‌గారు చాలా స్పష్టంగా చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షతో పాటు, వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ.. రెండింటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని. మరి ఈ ప్రభుత్వం ఎందుకు అందుకు అంగీకరించడం లేదు? సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? విచారణ జరిగితే మేము తప్పు చేశామా, లేక మెరిట్‌ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చామా అనేది తేలిపోతుంది. సీబీఐ విచారణతో వాస్తవాలు బయటకు వస్తే ఎవరైనా బాధ్యత వహించాల్సిందే. 

టీడీపీ అంటేనే పచ్చి అబద్ధాల ఫ్యాక్టరీ:
    గ్రామ వార్డు సచివాలయాలపై మంత్రి డోలా బాల వీరాంజనేయులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో 2022 పీఆర్సీ ద్వారా రూ.22,460 బేసిక్‌ పే నిర్ణయించి, దాదాపు 1,15,000 మందిని రెగ్యులరైజ్‌ చేశాం. మిగిలిన నిబంధనల ప్రకారం క్వాలిఫై అయిన నాలుగైదు వేల మందిని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది. చంద్రబాబు లోకేష్‌ రోజుకో అబద్ధం చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 4 నుంచి 5 వేల మందిని మాత్రమే రెగ్యులరైజ్‌ చేశారు. తాము చేసిన ఘనకార్యంగా చెప్పుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలి. ఇంకా గత ప్రభుత్వం చేసిన పనులను తమ ఖాతాలో వేసుకుంటూ చంద్రబాబు, లోకేష్, వారి మంత్రులు అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారు.

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అలీ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే:
    పోలీస్‌ ఉన్నతాధికారుల తీవ్ర పని ఒత్తిడి కారణంగా సీఐ అహ్మద్‌ అలీ ప్రాణాలు కోల్పోయారు. నిమజ్జనం బందోబస్తు పేరుతో రాత్రంతా నిద్ర లేకుండా చేసి, ఛాతీలో నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్తే డ్యూటీకి రావాలని బెదిరించి ప్రాణాలు తీశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలీస్‌ అధికారి చనిపోతే, ఆ నెపాన్ని నిరసన తెలిపిన సచివాలయ ఉద్యోగులపై నెట్టి వారిపై కేసులు బనాయించడం ఎంతవరకు న్యాయం? అని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిలదీశారు.

Back to Top