వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు మహేశ్వర్‌రెడ్డిపై దాడి

అనంత‌పురం ఆసుపత్రిలో  వైయ‌స్ఆర్‌సీపీ నేతల ప‌రామ‌ర్శ‌
 

అనంతపురం: గుంతకల్‌ నియోజకవర్గం పామిడి పట్టణానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు మహేశ్వర్‌రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్వర్‌రెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, గుంతకల్‌ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి పరామర్శించారు.

మహేశ్వర్‌రెడ్డిని కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్న నేతలు.. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. దాడిలో మహేశ్వర్‌రెడ్డి కుడిచేయి, కుడికాలుకు ఫ్యాక్చర్‌ అయినట్లు వైద్యులు తెలిపారని, శస్త్రచికిత్స అవసరమని సూచించినట్లు నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. గుంతకల్‌ నియోజకవర్గంలో గతంలో లేని విధంగా ముసుగులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై గతంలోనే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తాజాగా ఇది మూడో ఘటన అని తెలిపారు.

మహేశ్వర్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. కార్యకర్తలపై దాడులను అడ్డుకునేందుకు పోలీసులు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పామిడి మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ చెన్నకేశవరెడ్డితో పాటు పామిడి పట్టణ, మండల వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Back to Top