విజయవాడ: విజయవాడ నగరంతో కూడిన రాజధాని అభివృద్ధి తమ పార్టీ అభిప్రాయమని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగర ప్రజా సమస్యలపై వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయస్ఆర్‌సీపీ క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ‘స్థానిక పోరుకు సిద్ధం–ప్రజా సమస్యలపై యుద్ధం’ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు సోమవారం స్వాతి థియేటర్ వద్ద ప్రారంభించారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ ఆంజనేయరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్‌లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడలో తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నీటి కొరత నివారణకు వాటర్ ట్యాంకులు, రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం వాటి నిర్వహణ సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నగరంలో చెత్త తొలగింపు, డ్రైనేజీల నిర్వహణపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు చెల్లించే పన్నుల సొమ్మును స్థానిక అవసరాలకు వినియోగించాలని, విజయవాడ నగరపాలక సంస్థకు తగిన నిధులు అందించాలని వెలంపల్లి కోరారు. అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, మహిళలు, విద్యార్థులు, పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలుపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఎల్‌వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రజలు ప్రజాప్రతినిధులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉందన్నారు.