కర్నూలు: రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులు, సాగునీటి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి (ఆర్‌వీపీఎస్) నాయకులు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ నేతృత్వంలో సజ్జలను కలిసిన నేతలు రాయలసీమ కరువు పరిస్థితులను వివరించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలుకు న్యాయ రాజధాని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించిందని వారు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గుండ్రేవుల, వేదవతి, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుల పూర్తితో రాయలసీమలో సాగునీటి సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లో సరైన వర్షాలు లేక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వం కొన్ని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందని పేర్కొన్నారు. రాయలసీమలోని అన్ని జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, రాయలసీమలో కరువు, వలసలు, రైతుల ఆత్మహత్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆర్‌వీపీఎస్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు.