మాదాసి కురువ, మాదారి కురువ కుల ధ్రువీకరణ పత్రాల సమస్య పరిష్కరించాలి

సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన హక్కుల పోరాట సమితి నాయకులు

తాడేపల్లి: మాదాసి కురువ, మాదారి కురువ కుల ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన మాదాసి కురువ, మాదారి కురువ ఎస్సీ హక్కుల పోరాట సమితి నాయకులు వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జలను కలిసి తమ సమస్యలను వివరించారు.

మాదాసి కురువ, మాదారి కురువ కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను నాయకులు సజ్జల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో జీవో నంబర్‌ 53 ద్వారా ఆర్డీవో నుంచి ఎమ్మార్వో వరకు ఉన్న ప్రక్రియను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిందని తెలిపారు. దీంతో కర్నూలు జిల్లాలో దాదాపు 4 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని హక్కుల పోరాట సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి సావధానంగా విని, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాదాసి కురువ, మాదారి కురువ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకన్న, ప్రధాన కార్యదర్శి కురువ శివప్రసాద్‌, జేఏసీ మాజీ చైర్మన్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top