ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

 కర్నూలు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అన్ని స్థానాల్లో బలంగా పోటీ చేస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలో రీజినల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నేతల సమావేశంలో స్థానిక ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పాణ్యం నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కాటసాని విమర్శించారు. ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేశామని చెప్పడం కాకుండా వాటి ప్రభావం ప్రజల జీవితాల్లో కనిపించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో సమాధానం చెబుతారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోవాలని కూటమి నేతలకు సూచించారు. స‌మావేశంలో మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌, నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రామభూపాల్‌రెడ్డి , క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, ర‌వికిశోర్‌రెడ్డి, గంగుల నాని, మాజీ ఎంపీ పోచ బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి, డిప్యూటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చ‌ల్లా మ‌ధుసూద‌న్‌రెడ్డి, డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌, కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Back to Top