తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలను, డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తున్న యువత, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారని, అలాంటి వాటికి భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పార్టీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వంగలపూడి అనిత తానొక హోంమంత్రిని అనే విషయం కూడా మరిచిపోయి, ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలను బ్లేడ్ బ్యాచ్, గూండాలు, రౌడీషీటర్లు అని సంబోధించడాన్న ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ వారి పక్షాన పోరాడుతుందని చెప్పారు. శాప్ కార్యాలయం వద్ద వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. మాపైనే దాడి చేసి తిరిగి మాపైనే ఎస్సీ, ఎస్టీ, అటెంమ్ట్ టు మర్డర్ వంటి తీవ్రమైన కేసులు పెట్టారని, మళ్లీ పక్కా ప్రణాళికతోనే సమస్యను పక్కదారి పట్టించడమే లక్ష్యంగా వెన్నుపోటు పార్టీ గూండాలను మోహరించి దాడులు చేయించిందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని ఆమె విమర్శించారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి నియామకాల వరకు జరిగిన అడ్డగోలు వ్యవహారాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని నాగమల్లీశ్వరి డిమాండ్ చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... డీఎస్సీలో జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తున్న మా నాయకులు, కార్యకర్తలను హోంమంత్రి అనిత రౌడీషీటర్లు, గుండాలు, బ్లేడ్ బ్యాచ్ అని మాట్లాడటం సరికాదు. యువగళం టీమ్ అక్కడికి ఎందుకు వచ్చింది? అక్కడ జరిగిన దాడిలో కర్రలు ఎవరు తీసుకొచ్చారు? ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ఒకసారి పరిశీలించాలి. ప్రశాంతంగా నిరసన చేస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఎస్సీ, ఎస్టీ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారు. మహిళలపైనా కేసులు పెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించిన భావ ప్రకటన, ప్రశ్నించే స్వేచ్ఛను గౌరవించాలి. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం మా బాధ్యత. డీఎస్సీ అభ్యర్థులు అప్పులు చేసి, కష్టపడి చదివి, కోచింగ్‌లు తీసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వారి భవిష్యత్తుతో ఆటలాడే హక్కు ఎవరికీ లేదు. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఏం జరిగింది, ఎలాంటి సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు జరిగాయో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులను మూయించడం సమస్యకు పరిష్కారం కాదు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐకి అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ విచారణకు అప్పగించి పారదర్శకతను నిరూపించుకోవాలి. మంత్రి నారా లోకేష్ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. యువతను మోసం చేసే విధానాలను, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసులు పెట్టే విధానాన్ని వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తుంది. డీఎస్సీ వల్ల ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులకు అండగా మా పార్టీ నిలబడుతుంది. ప్రశ్నించే యువతపై ఒత్తిడి తీసుకురావడం ఆపి, జరిగిన వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. డీఎస్సీ అంశంలో నిజానిజాలు వెలుగులోకి వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని నాగమల్లీశ్వరి స్పష్టం చేశారు.