తాడేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను వేగంగా గుర్తించి, బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని, పలు దఫాలుగా చర్చించిన అనంతరం జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలను గట్టిగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో వచ్చే ఎన్నికలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన నష్టాలు, కష్టాలను ప్రతి గడపకు వెళ్లి వివరించాలని వైఎస్ జగన్ పార్టీ నేతలకు సూచించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎదురైన ఇబ్బందులను ప్రజలకు వివరించాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలంతో, అడ్డదారుల్లో గెలిచేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.