తాడేపల్లి: సమస్యలు పరిష్కరించమంటే లాఠీలు.. హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులు.. శాంతియుతంగా నిరసన తెలిపితే నిర్బంధాలు.. ఇదేనా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడే పాలన అంటూ వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో శాంతియుతంగా నిరసన చేపడితే అడుగడుగునా అడ్డుకోవడం, ముందస్తు అరెస్టులు చేయడం, మహిళా ఉద్యోగులపైనా పోలీసులతో దౌర్జన్యంగా వ్యవహరించడం దారుణమని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్‌రెడ్డితో కలిసి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులతో చర్చించి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో అప్పిరెడ్డి ఏమన్నారంటే.. - గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థ “మహాత్మాగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలనే ఆలోచనతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు నేరుగా అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఉద్యోగులను ఏ పార్టీకి చెందినవారిగా చూడకుండా ప్రభుత్వ ఉద్యోగులుగానే గౌరవించాం. అలాంటి ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరితే వారిపై ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజసం?” - 27 నెలలుగా సమస్యలు చెప్పినా అరెస్టులేనా? “నోషన్ ఇంక్రిమెంట్లు, పదోన్నతి మార్గం వంటి సమస్యలపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 27 నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే వారు కోరుతున్నారు. ఆదివారం సెలవు రోజున విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేసేందుకు వస్తే ఎంపీడీవోలు, కలెక్టర్లు, పోలీసులను ఉపయోగించి అడ్డుకోవడం, బస్సులను నిలిపివేయడం, ముందస్తు అరెస్టులు చేయడం ఎందుకు? సుమారు 141 మంది సంఘాల నాయకులను ముందుగానే నిర్బంధించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులను నిర్బంధించారు. మహిళా ఉద్యోగులను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం, లాఠీచార్జీలు చేయడం అమానుషం. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదు.” - ఉద్యోగులే కాదు.. పోలీసులపైనా పని ఒత్తిడి “ఈరోజు నున్నకు చెందిన సీఐ గుండెపోటుతో మరణించారన్న వార్త మాకు తీవ్రంగా బాధ కలిగించింది. ఈ ఘటన కూడా ఉద్యోగులపై ప్రభుత్వం పెంచుతున్న పని ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది. సచివాలయ ఉద్యోగులే కాదు.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, చివరకు పోలీసు అధికారులు కూడా ఈ పని ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యమిస్తున్న ఉద్యోగులు కూడా మన పిల్లలే అన్న మానవత్వంతో పోలీసులు వ్యవహరించాలి. వారిని పావులుగా ఉపయోగించకుండా ప్రభుత్వం ఉద్యోగులతో నేరుగా మాట్లాడాలి. రాజధాని నడిబొడ్డున మహిళా ఉద్యోగులను రోడ్డుపై ఈడ్చుకెళ్లే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం.” - సచివాలయ వ్యవస్థను కాపాడాలి.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి “కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మందులు, ఆహారం, ప్రభుత్వ సేవలు చేరవేయడంలో సచివాలయ వ్యవస్థ ఎంతో కీలకంగా పనిచేసింది. ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయడం నుంచి సర్వేలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల వరకు సచివాలయ ఉద్యోగులే ముందుండి పనిచేస్తున్నారు. అలాంటి వ్యవస్థను కుదించి ఉద్యోగులపై మరింత పని భారం మోపడం సరికాదు. 15,004 సచివాలయాలను 7,715కు కుదించే చర్యలను ప్రభుత్వం పునరాలోచించాలి. ఉద్యోగులను అణచివేయడం కాదు.. వారితో చర్చించి సమస్యలను పరిష్కరించాలి. మొండి వైఖరిని వీడి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలి. ఉద్యోగుల పక్షాన రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలి.”