చీపురుపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని శాసన మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తుపాన్, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న అరటి, బొప్పాయి తదితర పంటలను ఆయన పరిశీలించి, తీవ్రంగా నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. పంట నష్టానికి మొక్కుబడి పరిహారం కాకుండా రైతులు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. రైతులకు పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందించడంతో పాటు యూరియా కొరతను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే.. - రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం “ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి.. వాటిని ఎవరూ ఆపలేరు. కానీ విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాలి. నష్టపోయిన రైతులను, పంటలను ఆదుకోవాలి. చీపురుపల్లి ప్రాంతంలో అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు ఆరు నెలలు కష్టపడి మళ్లీ నిలదొక్కుకుంటే ఇప్పుడు తుపాన్ వచ్చి పంటలను నాశనం చేసింది. కానీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరాం. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలి.” - పంట మొత్తం పోతే రైతు ఎలా బతకాలి? “అరటి సాగుకు ఎకరాకు కనీసం రూ.లక్ష పెట్టుబడి అవుతుంది. పంట చేతికొస్తే రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. బొప్పాయికి సుమారు రూ.1.50 లక్షల పెట్టుబడి అవుతుంది. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చే పంట ఇది. మొక్కజొన్నకు కూడా ఎకరాకు రూ.40-50 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంట మొత్తం పోతే రైతు ఎలా బతుకుతాడు? ఎకరాకు మొక్కుబడిగా రూ.25 వేలు ఇవ్వడం కాదు.. అరటి, బొప్పాయి, మొక్కజొన్న రైతులు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా పరిహారం ఇవ్వాలి. గత తుపాన్‌లో నష్టపోయిన రైతులకు కూడా కలిపి పరిహారం చెల్లించాలి. గత రెండున్నరేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు.” - మూడు రోజులుగా కరెంట్ లేదు.. తాగడానికి నీళ్లు లేని పరిస్థితి “తుపాన్ వస్తుందని వారం రోజుల ముందే సమాచారం ఉంది. అయినా మూడు రోజులుగా కరెంట్ కోతల కారణంగా ప్రజలకు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. కరెంట్ పోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటి? తాగునీరు లేకపోతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. మోటార్లు పనిచేయక మూడు రోజుల పాటు తాగడానికి నీళ్లు లేకపోతే ప్రజలు ఎలా బతుకుతారు? ఇది ప్రభుత్వ కనీస బాధ్యత. తుపాన్ వచ్చే విషయం ముందే తెలిసినప్పుడు అధికారులతో సమీక్షించి ముందస్తు ఏర్పాట్లు చేయాలి. మత్స్యకారులు బయటకు వెళ్లలేని పరిస్థితిలో వారి ఉపాధి, ఆహారం గురించి చూడాలి. గ్రామాల్లో పశువులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఇప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్‌పుట్ సబ్సిడీ లేదు, కాంపెన్సేషన్ లేదు.” - యూరియా, బీమా, రైతు భరోసాపై సమాధానం చెప్పాలి “యూరియా కోసం రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన పక్కనే ఉన్న ప్రాంతాల్లో యూరియా దొరుకుతోంది.. మన దగ్గర మాత్రం దొరకడం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా యూరియా ఎందుకు రావడం లేదు? ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి దీనికి సమాధానం చెప్పాలి. రైతు భరోసా కూడా కట్ చేశారు. గతంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతుల తరఫున బీమా ప్రీమియం చెల్లించి, పంట నష్టపోయిన రెండు మూడు నెలల్లోనే పరిహారం అందించింది. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టాన్ని పూర్తిగా నమోదు చేసి, రైతులకు బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, పెట్టుబడికి తగ్గ నష్టపరిహారం అందించాలి. రైతుల కష్టాలను పట్టించుకోకుండా ఎంతకాలం మాటలతో కాలం గడుపుతారు? రైతులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ వారి పక్షాన అండగా ఉంటుంది.”