తాడేపల్లి: అమరావతి రాజధాని అభివృద్ధి ముసుగులో చంద్రబాబు మరో భారీ కుంభకోణానికి తెర లేపారని, ’గ్రామకంఠం’ భూముల పేరుతో రూ.12 వేల కోట్ల విలువైన దాదాపు 3 వేల ఎకరాల భూములను టీడీపీ నేతలు దోచుకున్నారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తెలిపారు. సీఆర్డీఏ పూలింగ్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జేఏసీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రముఖుల సొంత పట్టా భూములను సైతం గ్రామకంఠాలుగా చూపించి మినహాయింపులు పొందారని ఆయన వెల్లడించారు. గ్రామకంఠం కింద మినహాయింపు కోరి దరఖాస్తు చేసుకున్న 698 మంది పేద రైతుల్ని పక్కన పెట్టి, కేవలం పార్టీకి అనుకూలంగా ఉన్న 17 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చారని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ వేధింపులు తట్టుకోలేక చివరకు మందడంకు చెందిన రైతు రంజిత్‌కుమార్ తీవ్ర మనోవేదనతో చనిపోయాడని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంగవీటి నరేంద్ర వివరించారు. ప్రెస్‌మీట్‌లో వంగవీటి నరేంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..: ల్యాండ్ పూలింగ్‌లోనూ స్కామ్!: అమరావతి రాజధాని పేరుతో గతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి తమకు అనుకూలమైన వ్యక్తులకు భూములు కట్టబెట్టిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు గ్రామకంఠం భూముల పేరుతో మరో భారీ భూదోపిడీకి తెర తీశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు నేటికీ తమ ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించలేని కూటమి ప్రభుత్వం, వెన్నుపోటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అమరావతి జేఏసీలో చురుగ్గా పని చేసిన తమ అనుకూల వ్యక్తులకు మాత్రం వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు కల్పిస్తోంది. నిజమైన గ్రామకంఠం భూములను మాత్రమే మినహాయించాల్సి ఉండగా, టీడీపీ నేతల సొంత పట్టా భూములను సైతం గ్రామకంఠాలుగా చూపించి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో మొదట 34 వేల ఎకరాలుగా ప్రారంభమైన భూసేకరణ 55 వేల ఎకరాలకు చేరింది. ఇందులో 6,473.72 ఎకరాలను మినహాయింపు భూములుగా గుర్తించగా, దాదాపు 3 వేల ఎకరాలను గ్రామకంఠం పేరుతో మినహాయించారు. వీటి విలువ సుమారు రూ.12 వేల కోట్లు. గ్రామకంఠం మినహాయింపుల కోసం 698 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 17 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ 17 మందిలో ఎక్కువమంది టీడీపీకి అనుకూలంగా పని చేసిన వారే ఉండటం ఈ వ్యవహారంలోని రాజకీయ ప్రయోజనాలను స్పష్టం చేస్తోంది. చంద్రబాబు రాజ్‌మహల్ నిర్మాణానికి భూములిచ్చినందుకు..: చంద్రబాబు నిర్మించాలనుకుంటున్న రాజ్‌మహల్ కోసం కంచర్ల సాంబశివరావు నుంచి 25 వేల గజాల స్థలాన్ని గజం రూ.7,500 చొప్పున సుమారు రూ.18 కోట్లకు కొనుగోలు చేశారు. అదే ప్రాంతంలో గజం రూ.50 వేలు పలుకుతోందని ప్రచారం చేస్తున్న చంద్రబాబు, ఇంత తక్కువ ధరకు భూమి కొనుగోలు చేయడం వెనుక ఉన్న లావాదేవీలేమిటో చెప్పాలి. ఆ భూమికి సంబంధించిన సర్వే నంబర్ 91/1ఎఫ్‌లో గ్రామకంఠం ఎక్సెంప్షన్ ఫేజ్–1 పేరుతో మినహాయింపు ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలి. శివరాంప్రసాద్‌తో పాటు దామినేని శ్రీనివాసరావు, అనుమోలు ప్రభావతి, ఆలూరు చంద్రశేఖర్ తదితరులకు చెందిన భూములకు కూడా గ్రామకంఠం పేరుతో మినహాయింపులు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్‌లో సహకరించిన టీడీపీ అనుకూల వ్యక్తులకు ఇలా ప్రత్యేక ప్రయోజనాలు కల్పించారు. ప్రజల అవసరాలకు, పార్కులు, పార్కింగ్ స్థలాలకు వినియోగించాల్సిన భూముల్లో కమర్షియల్ కాంప్లెక్సులు, ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించడం దేనికి సంకేతం? మరోవైపు 25 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన ఆలూరు రంజిత్ కుమార్ తన భూమి పక్కనున్న అమ్మవారి ఆలయాన్ని గ్రామకంఠం కింద మినహాయించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. చివరికి ఆయన తీవ్ర ఒత్తిడికి గురై మరణించారు. అయినా ప్రభుత్వం దీనిపై కనీసం స్పందించ లేదు?. 698 రైతుల్లో 17 మందికే ఎందుకు మినహాయింపు!: రాజధాని రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి, తమకు అనుకూలమైన వ్యక్తులకు లబ్ధి చేకూర్చడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా మారింది. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ ఈ భూవ్యవహారాలపై సమాధానం చెప్పాలి. గ్రామకంఠం పేరుతో మినహాయింపులు పొందిన భూముల పూర్తి వివరాలు, లబ్ధిదారుల పేర్లు, సర్వే నంబర్లు, సంబంధిత అధికారుల నిర్ణయాలను బహిర్గతం చేయాలి. 698 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 17 మందికే ఎందుకు అనుమతులు ఇచ్చారో వెల్లడించాలని వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు.