తాడేపల్లి : భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యావ్యవస్థకు ఆజాద్ బలమైన పునాదులు వేశారని వైయస్ జగన్ కొనియాడారు. విద్య ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమని విశ్వసించిన గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు. విద్యావ్యాప్తి, ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధి, మతసామరస్యం, లౌకికవాదం, జాతీయ సమైక్యత కోసం ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆజాద్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని వైయస్ జగన్ పేర్కొన్నారు. విద్య వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ, దేశ ప్రగతికి పునాది అనే ఆజాద్ ఆలోచనలు నేటికీ మార్గదర్శకమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మైనార్టీ నాయకులు మహ్మద్ రుహుల్లా, డాక్టర్ మెహబూబ్ షేక్, షరీఫ్, దస్తగిరి, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.