తాడేపల్లి: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, తల్లి చెల్లి అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.శేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ రెండున్నరేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎంత ఉన్నాయి, ఇప్పటివరకు ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉందన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం నారా లోకేష్‌కు లేదా అని నిలదీశారు. రూ.5 వేల కోట్లు చెల్లించామని గొప్పలు చెప్పుకుంటున్న లోకేష్ అందుకు సంబంధించిన బడ్జెట్ వివరాలు, నిధుల విడుదల ఆధారాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం మానుకుని, విద్యార్థుల పక్షాన బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శేఖర్‌రెడ్డి హితవు పలికారు. ప్రెస్‌మీట్‌లో జి.శేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ఈవెంట్లకు ఖర్చు చేయడానికి డబ్బులున్నాయా?: కుప్పం నుంచి కురుపాం వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించకుండా, పరీక్షలకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా, సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నారు. చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల ఒత్తిడిని తట్టుకోలేక ఇద్దరు పేద విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ దారుణానికి బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాదా? పేద విద్యార్థుల చదువుల కోసం నిధులు కేటాయించలేని ప్రభుత్వానికి ఈవెంట్లు, ప్రచార ఆర్భాటాలకు మాత్రం వందల కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విద్యార్థుల భవిష్యత్తు కంటే మీ ప్రచారమే ముఖ్యమా? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.9,100 కోట్లు, మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించి వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు కలిపి రూ.12,400 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. రూ.5 వేల కోట్లు ఫీజు బకాయిలు చెల్లించామని చెబుతున్న నారా లోకేష్ ఆ మాటలకు ఆధారాలు చూపించాలి. కాగ్ లెక్కల ప్రకారం 2024–25లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించింది కేవలం రూ.1,771 కోట్లు మాత్రమే. మొత్తంగా రెండున్నరేళ్లలో చెల్లించింది కేవలం రూ.2800 కోట్లు మాత్రమే. మొత్తంగా విద్యార్థులకు రూ.9,600 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పుడు విద్యార్థుల చదువులకు అవసరమైన నిధులు విడుదల చేయకుండా వారి భవిష్యత్తుతో చంద్రబాబు, నారా లోకేష్ చెలగాటమాడుతున్నారు. రూ. 5 వేల కోట్లు ఎప్పుడు, ఎవరికి చెల్లించావో చూపించు: నిజంగా రూ.5 వేల కోట్లు చెల్లించి ఉంటే ఏ బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేశారో, ఎప్పుడు చెల్లించారో ఆధారాలతో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం నారా లోకేష్‌కు ఉందా? పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల గురించి జగన్‌గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన నారా లోకేష్ వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై మాట్లాడకుండా కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకురావడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని జి.వీరశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు.