తాడేపల్లి: ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) మృతిపట్ల వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని వైయస్ జగన్ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన విలక్షణ నటనతో మెప్పించారని గుర్తుచేశారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలకు జీవం పోసిన గిరిబాబు మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. సినీ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.